
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు 102వ జయంతిని తెలుగు ప్రజలంతా సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా ఆయన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకల్లో పాల్గొన్న సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇప్పటికీ కోట్లమంది హృదయాల్లో సజీవంగా ఉన్నారు. అన్ని దేవతా రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. ఆయన మన దేశం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నాదేశం సినిమాతో పూర్తవుతుందనుకున్నాం. కానీ మేజర్ చంద్రకాంత్‌తో ముగించారు. ఆ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొన్నారు. రాముడెలా ఉంటాడు.. కృష్ణుడెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ ఆ దేవుళ్ల రూపాలన్నీ ఆయనలో చూపించొచ్చు. మేము దైవంగా ఆరాధించే మహానుభావుడు ఆయన..’’ అన్నారు.
నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాన్నగారి జయంతి అంటే మాకు పండగ రోజు. ఇది ఒక అవతార పురుషుడు జన్మించిన రోజు. నా దృష్టిలో ఆయన భగవంతుడు. కోట్లమంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను నమ్మి ఆచరించారు. అనేక సమాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. రాజకీయ నాయకుడుగా పేదల పెన్నిధిగా నిలిచారు. అనేక సంక్షేమ పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ యేడాది నుంచి ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను..’’ అన్నారు.

మాదాల రవి మాట్లాడుతూ.. ‘‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. కథా నాయకుడుగానే కాక ప్రజా నాయకుడుగా తెలుగు దేశం పార్టీ స్థాపించి అతి తక్కువ టైమ్‌లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఆ అవార్డ్‌కే గౌరవం వస్తుంది. మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఎన్టీఆర్ గారికి 102వ జయంతి శుభాకాంక్షలు చెబుతున్నాము..’’ అన్నారు.
నందమూరి రూప మాట్లాడుతూ.. ‘‘మా తాతగారైన నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి పౌరుషం. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి ఆత్మగౌరవం. తెలుగు వారికి దైవ సమానులు. తెలుగు జాతి గొప్పదనాన్ని చాటిన మహాను భావుడు. స్వయంకృషితో ఎదిగి ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు.’’ అని అన్నారు.
తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘మనకు చరిత్రలో మొట్టమొదటి ప్యాన్ ఇండియా స్టార్ నందమూరి తారకరారమారావు గారు. తన ఐదో సినిమా పాతాళ భైరవితోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ హిట్స్ కొట్టారు. సినీ రంగంలో రారాజుగా వెలిగారు. ఆ రోజుల్లో హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కుటుంబం అంటే తెలుగు వాళ్లంతా అని భావించారు. పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. అనేక సంక్షేమ పథకాలతో తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాంటి గొప్ప మనిషికి మరణమే లేదు.. ’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, నటులు పాల్గొన్నారు.