
మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం థగ్ లైఫ్. యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ నటించిన ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కమల్, మణిరత్నం థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మణిరత్నం.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. నాగార్జునతో గీతాంజలి తీసిన తర్వాత మణిరత్నం తెలుగు హీరోతో సినిమా చేయలేదు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి తీస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ.. మణిరత్నం నెక్ట్స్ మూవీ నవీన్ పొలిశెట్టితోనే ఉంటుందా..? దీని గురించి అడిగితే మణిరత్నం ఏం చెప్పారు..?
థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో మణిరత్నంను నవీన్ పొలిశెట్టితో సినిమా గురించి అడిగితే.. అలాంటిది ఏమీ లేదని.. అదంతా పుకారు అన్నట్టుగా తేల్చేసారు. దీంతో మణిరత్నం తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. మణిరత్నం ఒకప్పుడు హీరోలను కంటిన్యూ చేసే వారు కాదు. రజినీకాంత్ తో దళపతి చేసిన తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. నాగార్జునతో గీతాంజలి చేసిన తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు. బొంబాయి సినిమాను విక్రమ్ తో చేయాలి కానీ.. కుదరలేదు. అందుచేతనే అరవింద్ స్వామిని రిపీట్ చేయాల్సివచ్చింది.
ఇక మాధవన్ పరిచయం అయిన తర్వాత హీరోలను రిపీట్ చేయడం స్టార్ట్ చేశారు మణిరత్నం. సఖి, యువ, అమృత చిత్రాల్లో మాధవన్ ని రిపీట్ చేశారు. మణిరత్నం డైరెక్షన్ లో మూడు సినిమాల్లో నటించిన క్రెడిట్ మాధవన్ కే దక్కుతుంది. ఆతర్వాత విక్రమ్ రావణ్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో శింబు చేరబోతున్నాడు అనే కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు శింబు మణిరత్నం డైరెక్షన్ లో నవాబ్, థగ్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మణిరత్నం నెక్ట్స్ మూవీని శింబుతోనే చేయబోతున్నాడు అని ప్రచారం జరుగుతోంది.
మణిరత్నం నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. శింబు నటించడం కన్ ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. ఇక కథానాయికగా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ఈమధ్య పీరియాడిక్, యాక్షన్ డ్రామాలు తీసిన మణిరత్నం ఇప్పుడు రిలీఫ్ కోసం న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నారట. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని టాక్. ముందు ఈ సినిమాను కొత్తవాళ్లతో చేయాలి అనుకున్నారు కానీ.. ఆతర్వాత శింబును లాక్ చేశారని సమాచారం. థగ్ లైఫ్ మూవీ రిలీజైన తర్వాత ఈ సినిమాని ప్రకటిస్తారని తెలిసింది. మరి.. శింబుతో ఎలాంటి ప్రేమకథను తెరకెక్కిస్తారో చూడాలి.