అల్లు అరవింద్, దిల్ రాజు.. ఆ నలుగురిలో నెక్ట్స్ ఎవరు..?

పవన్ ప్రెస్ నోట్.. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. పవర్ స్టార్ తనదైన స్టైల్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ మాట్లాడడంతో బడా నిర్మాతలు షేక్ అయ్యారు. దీనంతటికీ కారణం నేను కాదంటే.. నేను కాదు అంటూ ఒక్కొక్కరు తమ వాదనను వినిపిస్తున్నారు. ఆ నలుగురులో నేను లేనంటూ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆతర్వాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే చెప్పారు. బడా నిర్మాతలు ఒక్కొక్కరు మీడియా ముందుకు వస్తుండడంతో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. నెక్ట్స్ ఎవరు..? అసలు ఏం జరుగుతోంది..?

పవన్ నుంచి ఈ తరహాలో ప్రెస్ నోట్ వస్తుందని ఇండస్ట్రీ జనాలే కాదు సామాన్య జనాలు కూడా ఊహించలేదు. అందుకనే.. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి.. నేను ఆ నలుగురులో లేనని.. పవన్ అన్నదాంట్లో నిజముందని చెప్పారు. తన సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే అని.. తనని దీనిలోకి లాగద్దన్నారు. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి 24 గంటలు అవ్వక ముందే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈయన కూడా సేమ్ టు సేమ్ తనకు సంబంధం లేదని.. నేను ఇప్పుడు వేరే లెవల్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. అంతే కాకుండా.. పవన్ కళ్యాణ్‌ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు.

ఇదిలా ఉంటే.. అసలు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ఎగ్జిబిటర్స్ అన్నారు కానీ.. ఇంకా అది కన్ ఫర్మ్ కాలేదు. దీనిని మీడియా హైలెట్ చేయడంతో జనాలకు, ఏపీ గవర్నమెంట్ కు వేరేలా కమ్యూనికేట్ అయ్యిందని.. అసలు ఇదంతా మీడియానే చేసిందన్నారు దిల్ రాజు. ఇలా బడా నిర్మాతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాకు సంబంధం లేదంటే.. మాకు సంబందం లేదు అంటున్నారు కానీ.. సమస్య ఏంటో దానికి పరిస్కారం ఏంటో చెప్పడం లేదు. మరో బడా నిర్మాత కూడా మీడియా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇంకెంత మంది నిర్మాతలు మీడియా ముందుకు వస్తారో.. ఏం చెబుతారో.. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి