ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు ఉంటే పంపించండి: టీడీ జనార్ధన్

తెలుగు నట దిగ్గజం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీజీ జనార్థన్, టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని దేశ దేశాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సక్సెస్ ను పురస్కరించుకుని ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. మేము విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తెలుగు వారు ఎన్టీఆర్ పట్ల చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింతగా తెలుగు ప్రజలకు చేరువచేయాలి.’’ అన్నారు.

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్థన్ మాట్లాడుతూ – ‘‘ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించాం. ఆ తర్వాత అమెరికాలో కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం గురించి తెలిసి దేశ విదేశాల్లోని అన్నగారి అభిమానులు మా దేశంలో నిర్వహిస్తాం అంటూ ముందుకొచ్చారు. అలా దుబాయ్, సింగపూర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి 8 దేశాల్లోని 13 నగరాల్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరిపారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు లేరు. ఆయన గొప్పదనం ఈతరం వారికి తెలిసేలా మొదట్లో ఒక వెబ్ సైట్ లాంఛ్ చేశాం, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రసంగాలతో భగీరథ గారు రచన చేసిన బుక్ ప్రింట్ చేశాం. ఇంకా ఆయన చరిత్రను చిరకాలం తెలుగు వారికి అందించేలా మీ దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ కూడా మాకు పంపవచ్చు. వాటిని కూడా గ్రంథస్థం చేస్తాం. NTR భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్తానికి కమిటీ కృషికి ధన్యవాదాలు’’ అన్నారు.

టీఎఫ్‌పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ – నటుడిగా, ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్ గురించి ఎన్నేళ్లయినా చెప్పుకోవచ్చు. సినీ రంగంలో హీరోగా వెలుగుతున్నప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా మన తెలుగు సినీరంగం, తెలుగు ప్రేక్షకులకే నా నటన అంకితమని చెప్పి ఆ అవకాశాలు తిరస్కరించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయన శతజయంతి వేడుకల్ని నిర్వహించేందుకు అప్పటి ఏపీ ప్రభుత్వ పాలకులు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ హైదరాబాద్ లోనూ అనేక ప్లేస్ లు మార్చి చివరకు కైత్లాపూర్ లో అనుమతి ఇచ్చారు. ఎలాంటి సహకారం అందించలేదు. అందుకే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ప్రజలు ప్రభుత్వాలను మార్చేశారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28ని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు. మొదటగా బాలకృష్ణ గారికి ఆ అవార్డ్ ఇవ్వడం ఆనందకరం. బాలకృష్ణ గారు నటుడిగా తాతమ్మ కల మూవీ నుంచి చూస్తే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం సముచిత గౌరవం ఇచ్చినట్లయింది. అన్నారు.