
సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను పక్కాగా ప్లాన్ చేసి రిలీజ్ చేయడం అనేది మరో ఎత్తు అని చెప్పచ్చు. రిలీజ్ డేట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా.. లాస్ట్ మినిట్ లో మార్చాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే.. సంవత్సరం క్రితం రిలీజ్ డేట్ లాక్ చేసినా పోస్ట్ పోన్ చేయక తప్పని పరిస్థితి ఇప్పుడు ఉంది. నట సింహం బాలకృష్ణ అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు పవన్, ప్రభాస్ వలన అఖండ 2 విడుదల తేదీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ.. పవన్, ప్రభాస్ ఏం చేశారు.? ఇంతకీ.. అఖండ 2 వచ్చేది ఎప్పుడు..?
బాలయ్య, బోయపాటి ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి అఖండ 2 చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తుండడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. అఖండ సినిమాకి మించి ఉండేలా కథ, కథనం ఉంటుందని.. బాలయ్య కనిపించే రెండు విభిన్నమైన పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని ఇన్ సైడ్ న్యూస్. అయితే.. ఈ క్రేజీ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అనుకున్న డేట్ కి ఈ సినిమాని రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారు.
అయితే.. అఖండ 2 వస్తుందనుకున్న సెప్టెంబర్ 25నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రానుందని ప్రకటించారు. దీనికి సుజిత్ డైరెక్టర్. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ షేక్ అయ్యింది. రికార్డ్ వ్యూస్ తో ఓజీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న పవర్ స్టార్ ఇప్పుడు డేట్స్ ఇచ్చారు. వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. అఖండ 2 రావాలి అనుకున్న సెప్టెంబర్ 25న ఓజీ వస్తుండడంతో డిసెంబర్ 5న అఖండ 2 మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అఖండ సినిమా 2021లో డిసెంబర్ 2న రిలీజ్ అయ్యింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చిన అఖండ సినిమా సక్సెస్ అవ్వడంతో సెంటిమెంట్ గా డిసెంబర్ పస్ట్ వీక్ లోనే అఖండ 2 ను కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్. అయితే.. ఇప్పుడు ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీని డిసెంబర్ 5 రిలీజ్ చేస్తున్నట్టుగా అఫిషియల్ గా ప్రకటించారు. ఇలా అఖండ 2 రిలీజ్ చేయాలి అనుకున్న సెప్టెంబర్ 25న పవన్ ఓజీ, డిసెంబర్ 5న ప్రభాస్ రాజాసాబ్ వస్తుండడంతో బాలయ్య ప్లాన్ మార్చి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్. మరి.. అఖండ 2 రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.