బాలయ్యకు షాక్ ఇచ్చిన ప్రభాస్..?

డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్. మారుతి ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ ఎప్పుడో రావాలి కానీ.. పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు రాజాసాబ్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే.. రాజాసాబ్ రిలీజ్ డేట్ తో బాలయ్యకు షాక్ ఇచ్చారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే రాజాసాబ్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. బాలయ్యకు షాక్ ఇచ్చారనే ప్రచారంలో వాస్తవం ఎంత..? రాజాసాబ్ ఫాలో అవుతోన్న సెంటిమెంట్ ఏంటి..?

రాజాసాబ్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ కుదరలేదు. ఆతర్వాత సెప్టెంబర్ లో రిలీజ్ అని వినిపించినా ఎక్కువుగా డిసెంబర్ 12న రాజాసాబ్ రావడం ఖాయం అంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ప్లాన్ మారింది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 5కు మారింది. ఇలా మారడమే బాలయ్యకు షాక్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. బాలయ్య నటిస్తోన్న మూవీ అఖండ 2. ఈ మూవీని ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరడం లేదని.. డిసెంబర్ 5న అఖండ 2 రానుందని ప్రచారం జరిగింది.

అఖండ 2 రావాలి అనుకున్న డిసెంబర్ 5న రాజాసాబ్ వస్తున్నట్టుగా ప్రకటించారు. రాజాసాబ్ డిసెంబర్ 5న రావడం అనేది తెలివైన నిర్ణయం. ఎందుకంటే.. సంక్రాంతి వరకు అంటే నెల రోజులు పాటు ఈ సినిమాకి పోటీ ఉండదు. డిసెంబర్ నెలాఖరున 25న అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ కానుంది. అదే రోజు అలియా భట్ ఆల్ఫా మూవీ వస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ రేంజ్ సినిమాలు కాకపోయినా బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుంటే ప్రభాస్ కు సోలో రిలీజ్ చాలా అవసరం. బాహుబలి నుంచి కల్కి వరకు ఇదే స్ట్రాటజీ ఫాలో కావడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. సాహో, రాధే శ్యామ్, ఆది పురుష సినిమాలు ఫ్లాప్ అయినా కలెక్షన్స్ పరంగా మంచి నెంబర్లు వచ్చాయి. అందుకనే డిసెంబర్ 5న లాక్ చేసారు రాజాసాబ్ మేకర్స్. ఇలా రాజాసాబ్ డిసెంబర్ 5న వస్తుందని ప్రకటించడమే అఖండ 2 చేస్తోన్న బాలయ్యకు షాక్ అని టాక్ వినిపిస్తోంది.

ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే.. డిసెంబర్ 5న పుష్ప 2 మూవీ రిలీజైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. డిసెంబర్ 5న రావడం అనేది పుష్ప 2 కు బాగా కలిసొచ్చింది. రెండు వారాల్లోనే 1000 కోట్లు ఈజీగా రాబట్టచ్చు. అలాగే నెల రోజులకు బలమైన రన్ దక్కుతుంది. పుష్ప 2 బాటలో వెళ్లడం అనేది రాజాసాబ్ కు కలెక్షన్స్ పరంగా ప్లస్ అవుతుంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలి. విఎప్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేయాలి. ప్రభాస్, సంజయ్ దత్ పై కీలక సన్నివేశాలు పూర్తి చేయాలి. సాంగ్స్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ అనుకున్న టైమ్ కి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మారుతి పై ఉంది. మొత్తానికి రాజాసాబ్ రిలీజ్ ప్లాన్ బాగానే ఉంది. మరి.. అంతా అనుకున్నట్టుగా జరిగి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందే లేదో చూడాలి.