
సినిమా చేశామా..? రెమ్యూనరేషన్ తీసుకున్నామా..? అనేది ఆలోచిస్తుంటారు హీరోలు. అయితే.. అతి కొద్ది మంది హీరోలు మాత్రమే నిర్మాత గురించి ఆలోచిస్తుంటారు. సినిమా అనుకున్నట్టుగా రిలీజైందా..? నిర్మాతకు లాభాలు వచ్చాయా..? లేక నష్టం వచ్చిందా..? అనేది ఆలోచిస్తుంటారు. తనతో సినిమా చేసిన నిర్మాతకు నష్టం వచ్చినా.. కష్టం వచ్చినా.. నేనున్నాను అంటూ ముందుకు వస్తారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ అలాగే చేశారని తెలిసింది. ఇంతకీ.. పవన్, సిద్దు ఏం చేశారు..?
వీరమల్లు సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటుంది. క్రిష్ ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక తన వల్ల కాదని డిసైడ్ అయ్యారు. ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మిగిలిన ఇరవై శాతం షూటింగ్ ను జ్యోతికృష్ణ కంప్లీట్ చేశారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటి వరకు చాలా సార్లు మారింది. ఈసారి పక్కాగా జూన్ 12న వస్తుందని ప్రకటించారు. అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది ఇక రావడం పక్కా అనుకుంటే.. మరోసారి వీరమల్లు పోస్ట్ పోన్ కానుంది. అయితే.. ఐదేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటుండడంతో నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. వేరే నిర్మాత ఎవరైనా అయితే.. తట్టుకోలేరు అనే టాక్ వినిపిస్తుంది.
అయితే.. నిర్మాత పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్నారో ఏమో కానీ.. హరిహర వీరమల్లు కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ పదకొండు కోట్లను నిర్మాత ఏఎం రత్నంకు వెనక్కు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇది ఈ వార్త వీరమల్లుకి పెద్ద రిలీఫ్ కానుంది. ఇక సిద్దు జొన్నలగడ్డ విషయానికి వస్తే.. ఇటీవల సిద్దు నుంచి వచ్చిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీకి డైరెక్టర్. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత సిద్దు నుంచి వచ్చిన సినిమా కావడంతో పాజిటివ్ టాక్ ముందు నుంచి ఉంది.
పాజిటివ్ టాక్ తో వచ్చిన జాక్ ఏమాత్రం మెప్పించలేదు. ఇంకా చెప్పాలంటే.. కనీసం ఓపెనింగ్ కూడా తీసుకురాలేకపోయింది. దీంతో సిద్ధూ జొన్నలగడ్డ జాక్ వల్ల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తీవ్రంగా నష్టపోయారు. బ్రేక్ ఈవెన్ లో సగం కూడా వసూలు కాకపోవడం డిజాస్టర్ స్థాయిని పెంచింది. అందుకనే సిద్ధూ తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో సగానికి పైగా వెనక్కు ఇచ్చినట్టు తెలిసింది. ఇది నాలుగున్నర కోట్ల దాకా ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. ఇలా తన నిర్మాత నష్టాల గురించి తెలుసుకుని పవన్ కళ్యాణ్, సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్స్ లో కొంత వెనక్కు ఇవ్వడం ఎంతైనా అభినందనీయం. ఇలా.. ప్రతి హీరో తన నిర్మాతకు నష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే.. ఎంతో మంచిదన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.