వెంకీ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతోన్న త్రివిక్రమ్!

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా 300 కోట్లు కలెక్ట్ చేయడంతో వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. అయితే.. చాలా కథలు విన్నాడు కానీ.. వెంకీకి ఏ కథ కూడా సంతృప్తినివ్వలేదట. ఇలాంటి టైమ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెంకీ కోసం స్టోరీ రెడీ చేయడం.. ఆ స్టోరీ ఓకే అవ్వడంతో ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యింది. వెంకీతో చేయనున్న ఈ మూవీ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. త్రివిక్రమ్ సెంటిమెంట్ ఏంటి..? తన సెంటిమెంట్ ప్రకారం ఏం చేయబోతున్నాడు..?

ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి.. తన సినిమా టైటిల్ ను అ అనే అక్షరంతో పెట్టడం అనేది సెంటిమెంట్ గా మారింది. అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమతే, అల.. వైకుంఠపురములో.. ఇలా అ అక్షరంతో టైటిల్స్ పెట్టిన సినిమాల్లో ఒక్క అజ్ఞాతవాసి తప్పా మిగిలిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈమధ్య త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం బాగానే ఉంది అనిపించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ.. కథ, కథనం పై చాలా విమర్శలు వచ్చాయి.

అయితే.. ఇప్పుడు వెంకీతో చేయనున్న మూవీ కోసం కూడా అ అనే సెంటిమెంట్ ను ఫాలో కానున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ఆనందరావు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ లీక్. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల తరహాలో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో వెంకీ సరసన నటించేందుకు రుక్మిణి వసంత్ ను కాంటాక్ట్ చేశారని తెలిసింది. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి.. త్రివిక్రమ్ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో..? ఈ మూవీతో వెంకీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.