
పూజా హేగ్డే అనడం కన్నా.. బుట్టబొమ్మ అంటే.. ఠక్కున గుర్తొస్తుంది. అంతలా ఈ అమ్మడు పేరు తెచ్చుకుంది. అయితే.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. కాలం కక్ష కట్టిందో.. పరిస్థితులు పగబట్టాయో కానీ.. పూజా పాప ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవ్వడమే కానీ.. సక్సెస్ అవ్వడం లేదు. దీంతో కెరీర్ బాగా వెనబడింది. దీంతో పాత పరిచయాలతో కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుందట. ఇంతకీ.. పూజా చేతిలో ఉన్న సినిమాలు ఏంటి..? ఇంతకీ.. పూజా ప్లాన్ ఏంటి..?
ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో పాత్రకు తగ్గట్టుగా నటించి కెరీర్ ప్రారంభంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా ఆశలన్నీ బాలీవుడ్ పైనే ఉండేది. పైగా టాలీవుడ్ లో ఫస్ట్ అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ వెళ్లింది. అక్కడ మొహంజదారో అనే సినిమా చేసింది కానీ.. ఆతర్వాత సరైన అవకాశాలు రాలేదు. ఏం చేయాలో తెలియని టైమ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ హారీష్ శంకర్ పూజాకు డీజే దువ్వాడ జగన్నాథమ్ అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయ్యింది. ఇక అక్కడ నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
యంగ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి, మెగా హీరో వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అల.. వైకుంఠపురములో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్, యూత్ కింగ్ అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఇలా.. స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సక్సెస్ సాధించడంతో పూజాకు మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా మళ్లీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో సర్కస్, కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రాలు విజయాన్ని సాధించకపోవడంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. కోలీవుడ్ లో ఇటీవల సూర్యతో కలిసి రెట్రో మూవీలో నటించింది. ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందేమో అనుకుంటే.. ఏమాత్రం మెప్పించలేకపోయింది.
ఇప్పుడు పూజా చేతిలో విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ మూవీ ఉంది. ఈ సినిమాలో పూజా పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. ఈ విషయాన్ని పూజా సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో పూజా నటిస్తుంది. ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ఇప్పుడు మలయిళ సినిమాలో ఎంట్రీ ఇస్తుందని.. దుల్కర్ సల్మాన్ కు జంటగా ఓ సినిమాలో నటిస్తుందని తెలిసింది. అలాగే ఓ బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది. అయితే.. సరైన సక్సెస్ లేకపోవడం.. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో తన పాత పరిచయాలు ఉపయోగించి కొత్త ఆఫర్స్ సంపాదించడం కోసం మేనేజర్స్, ప్రొడ్యూసర్స్ కు టచ్ లోకి వెళ్ళుతుందని.. మంచి క్యారక్టర్ ఉంటే చేయడానికి రెడీ అని చెబుతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మళ్లీ ఫామ్ లోకి రావాలని పూజా తపిస్తుంది. మరి.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో పూజా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూడాలి.