
ఆర్సీ అదేనండి.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చరణ్ 16వ సినిమా. బుచ్చిబాబు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నెక్ట్స్ మూవీని చరణ్.. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తో చేయనున్నాడు. సుక్కు చరణ్ మూవీ కోసం కథ పై కసరత్తు చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఇది చరణ్ 17వ సినిమా. మరి.. చరణ్ 18వ సినిమా ఎవరితో అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరే.. సందీప్ రెడ్డి వంగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి.. ఈ ఇద్దరిలో చరణ్ 18వ సినిమా ఎవరితో..?
పెద్ది తర్వాత చరణ్ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయాలని చరణ్ ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడని తెలిసింది. చరణ్, సందీప్ రెడ్డి కాంబోలో మూవీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. యానిమల్ మూవీ తర్వాత సందీప్ తో సినిమా చేయడానికి చరణ్ ఇంట్రెస్ట్ చూపించాడు. సందీప్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఇద్దరూ ఇటీవల ఓ హోటల్ లో కలుసుకుని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మహేష్ కోసం సందీప్ దగ్గర ఓ స్టోరీ ఉందట. చరణ్ ఓకే అంటే.. ఆ కథనే చెప్పాలి అనుకుంటున్నాడట. ఇందులో హీరో క్యారెక్టర్ యానిమల్ కు మించి ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. చరణ్ తో సినిమా చేయడం కోసం ట్రై చేస్తోన్న మరో డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బన్నీతో చేయాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో వెంకీతో సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత చరణ్ తో సినిమా చేయడం కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడట. త్వరలో త్రివిక్రమ్.. చరణ్ కు కథ చెప్పనున్నాడని కూడా ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబో వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారని.. దాదాపుగా ఈ కలయికలో సినిమా రావడం ఖాయమని టాక్ ఉంది. ఎప్పటి నుంచో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అటు చిరు, ఇటు చరణ్ ప్లాన్ చేస్తున్నారు కానీ.. వర్కవుట్ కావడం లేదు.
ఇప్పుడు చరణ్ కోసం సందీప్, త్రివిక్రమ్ పోటీపడుతుండడంతో ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే.. త్రివిక్రమ్ ప్లానింగ్ లో ప్రెజెంట్ వెంకీతో.. ఆతర్వాత బన్నీతో సినిమా ఉంది. ఇవే కాకుండా కుదిరితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేయాలి అనుకుంటున్నారట. మరో వైపు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిజీగా ఉండడం వలన ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు కానీ.. లేకపోతే ఈపాటికే స్పిరిట్ స్టార్ట్ అవ్వాలి. ఈ సినిమా తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ స్టార్ట్ చేయాలి. సో.. చరణ్ సుకుమార్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.