
తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం. తన జీవనానికి సరిపడా ధనం, తిండి, వస్తువులు ఉంచుకొని మిగిలినది ఇతరులకు ఇవ్వడం. దీనివల్ల మనిషిలో ఉన్న లోభగుణం నశిస్తుంది. పరోపకార గుణం అలవడుతుంది. పైగా ఒకరి దగ్గరే ఎక్కువ ధనం ఉంటే అది అతడికి భారంగా పరిణమిస్తుంది. దానిని దాచుకోవడానికి నానా అవస్థలు పడుతుంటాడు. అలాంటప్పుడు డబ్బుకే కాదు, అతడి ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. దీంతో మనశ్శాంతిని కోల్పోతాడు. కానీ, దానం వల్ల ఆ అవస్థల నుంచి బయటపడవచ్చు.
ఈ దానాలు ప్రధానంగా మూడు రకాలు. సాత్విక, రాజసిక, తామసిక దానాలు.
సాత్విక దానం..
ఈ దానం దేశ, కాల, పాత్రను బట్టి చేయాలి. పుణ్య క్షేత్రాలు, పర్వదినాల సమయంలో చేయాలి. యోగ్యుడు అయిన వాడికే దానం చేయాలి. ప్రత్యుపకారం కోరకూడదు. అప్పుడది దానం అనిపించుకోదు.
రాజసదానం…
కర్ణుడు చేసిన దానం అటువంటిదే. కర్ణుడు ఇంద్రుడికి తన కవచ కుండలాలు ఇచ్చి దాని బదులు ఇంద్రుడి వద్దనుంచి శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. అది రాజసదానం అవుతుంది. కాని సాత్విక దానం అనిపించుకోదు.
సాత్విక దానం…
దానం చేయడం నా ధర్మం. నేను దానం చేయాలి అని నిశ్చయించుకోవడం వేరు. పేరు ప్రతిష్ఠల కోసమో, ఒకరి మెప్పుకోసమో దానం చేయకూడదు. దానం చేయడం తన కర్తవ్యంగా భావించి చేయాలి. తాను దానం చేయడం వల్ల ఇతరులను ఉద్దరించాననే అహం పనికిరాదు. దానం చేయడం వల్ల తనను తాను ఉద్దరించుకుంటున్నాననే భావన తెచ్చుకోవాలి. అదే సాత్విక దానం.
ఇతరులు తనకు ప్రత్యుపకారం చేస్తారనే బుద్ధితో దానం చేయకూడదు. పేదవారికి, శక్తిలేని వారికి, వికలాంగులకు, దరిద్రులకు దానం చేయాలి. ఎందుకంటే వారు దానం స్వీకరిస్తారు కానీ తిరిగి ప్రత్యుపకారం చేసే శక్తి ఉండదు.
దానం ఎక్కడ చేయాలంటే.. పుణ్యక్షేత్రాల్లో, పుణ్యకాలమైన గ్రహణ సమయంలో, శ్రాద్ధ సమయంలో, సంక్రాంతి లేక మహాలయం మొదలయ్యే పితృ దేవతలను అర్చించే సమయంలో దానం చేయడం ఉత్తమం.