
సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా ముఖ్యమైనది. ప్రకృతిలో అనేక మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటిని భగవంతుని రూపాలుగా భావించి పూజిస్తాం. అలాంటి పవిత్ర వృక్షాలలో రావిచెట్టు కూడా ఒకటి. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని మనకు సకల శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుందని సైన్స్ కూడా చెబుతోంది. రావిచెట్టు అత్యధిక ఆక్సిజన్ అందించే వృక్షమని, కాలుష్యాన్ని సైతం తీసుకొని ఈ చెట్టు ప్రకృతికి అవసరమైన ఆక్సిజన్ ను అందించే గొప్ప చెట్టుగా శాస్త్రవేత్తలు తేల్చారు.
నిజమైన భక్తితో రావిచెట్టును పూజించి, దీపం వెలిగిస్తే భక్తులు తమ జీవితంలోని అన్ని కష్టాల నుంచి బయటపడతారు. అయితే రావిచెట్టు కింద దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయి. నియమాలను సరిగా పాటించకపోతే కొన్ని అనర్థాలు జరిగే అవకాశముంది. కాబట్టి అవేంటో తెలుసుకుందాం. వైదికశాస్త్రం ప్రకారం ఉదయం, సాయంత్రం రావిచెట్టు కింద దీపం వెలిగించడం అనేది శ్రేయస్కరం. ఎవరైతే ఈ ప్రత్యేక సందర్భంలో రావి చెట్టుకు 7సార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తారో అప్పుడు వారి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.
అయితే దీపం వెలిగించడానికి రాత్రి సమయం అశుభంగా పరిగణిస్తారు. అందుచేత రాత్రిపూట రావిచెట్టు ముందు దీపం వెలిగించవద్దు. ఈ కాలంలో దీపం వెలిగించడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. రావిచెట్టు ముందు దీపం వెలిగించడం కోసం ఆవనూనెను మాత్రమే ఎంచుకోవాలి. పూజాపరమైన కార్యక్రమాల్లో ఆవనూనె అత్యంత సముచిత విషయంగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం, శనివారాలు రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు.