ఇండోర్ మొక్కలతో ఇంట్లో అందం, అదృష్టం కలిసి వస్తాయి!

ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలోనూ వాస్తుశాస్త్రం కొన్ని నియమాలను పేర్కొంది. ఇంటిలోపల ఆవరణలో పెంచుకునే మొక్కల విషయంలో కూడా కొన్ని పాటించాల్సిన నియమాలున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు అందంగా నీట్ గా కనిపించడంతో పాటు బాగా కలిసి రావాలని కోరుకుంటారు. అలాంటి ఇంటిని అందంగా అలంకరించే విషయంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రకృతితో అనుసంధానం కావడంతో పాటు, చూడ్డానికి అందంగా.. ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు అదృష్టాన్ని అందించే ఈ మొక్కల స్థానం, ఉపయోగాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి..
భారతదేశంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. ఆధ్యాత్మికపరమైన, ఔషద గుణాలను సహజంగా కలిగి ఉన్న తులసి మొక్క స్వచ్ఛతకు చిహ్నం. శతాబ్దాలుగా తులసి మొక్క ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందింది. వాస్తు ప్రకారం తులసిని ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.

మనీ ప్లాంట్..
మనీ ప్లాంట్ శ్రేయస్సు, సానుకూల శక్తిని తెచ్చే ఉత్తమమైన మొక్క. పేరుకి తగినట్లుగా మనీ ప్లాంట్ సంపద, స్థిరత్వాన్ని ఆకర్షించేలా చేస్తుంది. ఇంటి లోపల ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని ఆగ్నేయ మూలలో ఉంచడం మంచిది.

స్నేక్ ప్లాంట్..
స్నేక్ ప్లాంట్ ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని అంటారు. ఈ మొక్క ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా మూలలో పెంచుకునేందుకు అనువైనది. అందువల్ల దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం ఉత్తమం.

జాడే మొక్క..
జాడే మొక్క గుండ్రని ఆకులు, కాయిన్ టైప్ లో కనిపిస్తాయి. దీని ఆకులలానే, డబ్బును ఆకర్షించే మొక్కగా పేరుంది. దీనిని వృద్ధి, అదృష్టం, శుభసమయానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందువల్ల దీనిని ప్రవేశద్వారం దగ్గర పెట్టుకోవాలి.

పీస్ లిల్లీ..
పీస్ లిల్లీ దీని పేరుకు తగ్గట్టే పీస్ ను అందిస్తుంది. శాంతికి ప్రసిద్ధి చెందిన మొక్క. ఎక్కువ గొడవలు జరిగే వాతావరణం ఉన్న ఇళ్ళల్లో పెంచుకునేందుకు ఈ మొక్క సరైన ఎంపిక. ఈ ఇండోర్ ప్లాంట్ విష పదార్థాలను సైతం ఫిల్టర్ చేస్తుంది. దీన్ని పెంచుకోవడం వల్ల రిలేషన్స్ లో సానుకూలత ఏర్పడుతుంది. దీన్ని లీవింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఉంచడం ఉత్తమం.