హనుమాన్ జయంతి రోజున పూజ ఇలా చేయండి..!

హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపం వెలిగించేవారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఇంకా ఈరోజున హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతిబాధలు తొలగిపోతాయనేది విశ్వాసం. అలాగే ఇంట్లో పూజచేసే భక్తులు, పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు వంటి వాటిని సమర్పించవచ్చు.

పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్ర నామాలు, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి లేదా
ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. వీలు కుదిరినవారు వెళ్లొచ్చు. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకాలు, హనుమాన్‌ చాలీసా పుస్తకాలను దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

జై హనుమాన్!!