నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం..!

ప్రతి పన్నెండేళ్లకోసారి పుణ్య నదులకు పుష్కరాలు అనేవి వస్తుంటాయి. సాధారణంగా పుష్కరాలు సంవత్సరం పాటు ఉన్నా.. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అంటూ మొదటి 12 రోజులు లేదా చివరి పన్నెండు రోజులను పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ఏడాది సరస్వతి నదికి పుష్కరాలు.. ఈ మే 15 నుంచి 26 వరకూ జరగనున్నాయి. ఆ పుష్కర ప్రత్యేకతల గురుంచి మనం ఈరోజు తెలుసుకుందాం:

అసలు పుష్కరం అంటే..?!
పూర్వం.. పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా… “ఓ పరమేశ్వరా! జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమయ్యాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, అందువల్ల నా శరీర స్పర్శతో పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని” కోరుకుంటాడు.
అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించినవారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు మనకు పురాణ గాథలు చెబుతున్నాయి.

పుష్కరం ఎలా వస్తుంది..
బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. మేష రాశిలో ప్రవేశిస్తే గంగానదికి, వృషభ రాశిలో ప్రవేశి స్తే నర్మదానది, మిథునంలో సరస్వతి, కర్కాటకంలోకి ప్రవేశిస్తే యమునానదికి, సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరినదికి, కన్యరాశిలోకి ప్రవేశిస్తే కృష్ణానదికి, తులారాశిలోకి ప్రవేశిస్తే కావేరి నదికి, వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తే తామ్రపర్ణి నదికి, ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే పుష్కర వాహినికి, మకర రాశిలోకి ప్రవేశిస్తే తుంగభద్రా నదికి, కుంభరాశిలోకి ప్రవేశిస్తే సింధు నదికి, మీనరాశిలోకి ప్రవేశిస్తే ప్రాణహిత నదికి పుష్కరాలు అనేవి క్రమంగా వస్తాయి.

సరస్వతి నది ఎక్కడ పుట్టింది..
భారతదేశంలోని ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మానా గ్రామంలో సరస్వతి నది జన్మించింది. ఇది భారత్, టిబెట్ సరిహద్దులో ఉంది. కాగా ప్రయాగరాజ్​లోని త్రివేణి సంగమంలో కూడా సరస్వతి నది పుష్కర పుణ్యస్నానాలను ఆచరిస్తారు. అలాగే రాజస్థాన్​లో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అంటారు. తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహిత, గోదావరి.. సరస్వతి నదుల సంగమంగా ఉంది. అందుకే ప్రతి పుష్కరాలప్పుడు ఇక్కడ కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఉండేలా చూస్తారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి పుష్కరాలు ఇవి. 12 రోజులపాటు జరిగే ఈ పుష్కర మహోత్సవాలకు రోజుకు సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా.. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం!