‘గరుడపురాణం’లో ఏ పాపం చేస్తే ఏ శిక్ష..?!

గరుడపురాణం… అనగానే శిక్షలను నిక్షిప్తం చేసిన గ్రంథమని తెలుసు.. వ్యాసమహర్షి రాసిన అష్టాదశ పురాణాలలో ఇది ఒక్కటి. ఈ పురాణం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుచేత అతని వాహనమైన గరుడకి ఉపదేశించడమైంది. అందుకే ఈ పురాణానికి ‘గరుడ పురాణం’ అనే పేరు వచ్చింది. మనిషి చనిపోయిన తర్వాత పుణ్యాలు చేస్తే స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి వెళ్తాడని మనం చిన్నపుడు నుంచి వింటూనే ఉన్నాం. అస్సలు నరకం ఎలా ఉంటుంది..?, నరకంలో ఏఏ పాపాలకు ఎటువంటి శిక్షలు విధిస్తారో? ఇందులో వివరించడమైంది.

మీరు చేసిన పాపాలను బట్టి నరకంలో మిమ్మల్ని ఆయా సెక్షన్లకు పంపిస్తుంటారు. మొత్తం 28 సెక్షన్లు వున్నాయి. వాటిలో కొన్ని…

  1. క్రిమి భోజనం… ఎవరైతే అతిధులను అవమానిస్తారో భోజనం కూడా సరిగ్గా పెట్టరో వారికి విధించే శిక్ష ఇది. అటువంటి వారిని పాములు, తేళ్లు, కీటకాలతో కుట్టిస్తుంటారు. అంతేకాదు వాటిని ఆహారంగా తినిపిస్తారు.
  2. తమిసరం… ఎవరైతే ఇతరుల సొమ్మును దోచుకొని దొంగిలిస్తారో, వారిని ఈ సెక్షన్లో కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా కొడుతూ శిక్షిస్తారు.
  3. అందతంత్రసం… భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ సరిగ్గా చూసుకోపోవడం ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని మోసం చేసేవారిని ఈ సెక్షన్ లోకి పంపిస్తారు. ఈ సెక్షన్ లో కూడా తమిసరంలో చెప్పిన మాదిరిగానే శిక్ష ఉంటుంది. కాకపోతే డోస్ కొంచం ఎక్కువగా ఉంటుంది.
  4. కుంభిపాకం… ఎవరైతే మూగజీవాలను తమ సుఖం కోసం హింసిస్తారో లేక చంపుతారో వారిని ఈ సెక్షన్ కి పంపిస్తారు. ఇక్కడ పాపులను సలసల కాగుతున్న నూనెలో వేసి వేగిస్తుంటారు. దీనినే కుంభిపాకం అంటారు.
  5. కాల సూత్రం… ఎవరైతే తమ పెద్దలను గౌరవవించరో, అవమానించి హీనంగా చూస్తారో అలాంటి వారిని వేడి వేడి మంటల్లోకి పంపించి కాల్చుతూ శిక్షిస్తారు.
  6. ఆసీతాపత్రాణం… ఎవరైతే తమకు నిర్దేశించిన పనిని సరిగ్గా చేయరో విధి నిర్వహణను విశ్రమిస్తారో అటువంటి వారిని ఈ సెక్షన్ కు పంపిస్తారు. అసీతాపత్ర అంటే, రంపంలాగా పదునైన కోణాలు వున్న ఆకులు… ఆ ఆకులతో రక్తం వచ్చేలాగా పాపుల వీపును విమానం మోత మోగిస్తుంటారు. ఒకవేళ ఆ బాధను భరించలేక పారిపోయే ప్రయత్నం చేస్తే ముఖంపై రాళ్ల వర్షం కురిపిస్తారు.
  7. సుకరముఖం… రాజకీయ నాయకులు ఎవరైతే న్యాయబద్ధంగా ప్రజలను పరిపాలించకుండా, ఇబ్బందికి గురి చేస్తారో వారికి విధించే శిక్ష ఇది. మట్టి పాత్రను తయారు చేసేటపుడు మట్టిని ఎలా తొక్కుతారో అలా ఇక్కడ పాపులను తొక్కి తొక్కి నుజ్జునుజ్జు చేసేస్తారు.
  8. అంధకూపం… ఎవరైతే మంచివారిని మోసం చేస్తారో వారి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని హింసిస్తారో అటువంటివారికి విధించే శిక్ష ఇది. దీని ప్రకారం వారిని చీకటి గుహలోకి తోసి క్రూర మృగాలతో కరిపించడం, కొమ్ములతో పొడిపించడం చేస్తుంటారు.