పూజా మందిరంలో ఎన్ని దేవుడి పటాలు ఉండాలి!

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో దేవునికి గది విడిగా ఉంటుంది. దీన్ని ఇంట్లో చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. నిత్య పూజారాధన చేయడం వల్ల సానుకూల శక్తి పెరిగి.. ఇంట్లో శాంతి నెలకొంటుందని పండితులు చెబుతారు. అయితే కాలంతో పాటు కొన్ని పద్ధతులు మారుతున్నాయి. దేవుడి గదిలో దేవుడి పటాలు, విగ్రహాలు ఎక్కువగా పెడుతున్నారు. కొందరు తెలిసి, తెలియక దేవుడి విగ్రహాలు, ఫోటోల విషయంలో చేసే కొన్ని పొరపాట్లు చాలా ఇబ్బందులకు దారి తీస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పూజ గదిలో దేవతల విగ్రహాలు లేదా పటాలను ఉంచే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. సరైన రకమైన విగ్రహాలు, వాటికి తగిన సంఖ్యను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నియమాలను ఉల్లంఘిస్తే అది కుటుంబ సభ్యుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.

  • ఉదాహరణకు ఒకే ఇంట్లో రెండు శివలింగాలను ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. శివలింగ స్థలం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఒక్క శివలింగాన్ని మాత్రమే పూజించడం ఉత్తమం.
  • గణపతిని విఘ్నాలు తొలగించే దైవంగా భావిస్తాం. అందుకే తొలిపూజ ఎప్పుడూ ఆయనకే అందాలి. అయితే మూడు గణపతి విగ్రహాలను ఇంట్లో ఉంచినట్లయితే అది శుభ ఫలితాలను ఇవ్వదట. ఇది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేదా ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందంటారు.
  • శంఖం చాలా పవిత్రమైనది. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. అర్చనలు, అభిషేకాలు చేసేటప్పుడు శంఖం ఉపయోగిస్తే ఆ పూజాఫలం మరింత పెరుగుతుంది. అలాగే పూజ సమయంలో శంఖానాదం చేయడం వల్ల దేవుడు ప్రసన్నమవుతాడని విశ్వాసం ఉంది. కానీ ఇంట్లో రెండు శంఖాలు ఉంచడం సరికాదని భావిస్తారు.
  • సూర్య భగవానుడు శక్తికి చిహ్నం. ఈయన ప్రత్యక్ష దైవం. అయితే ఇంట్లో రెండు సూర్య విగ్రహాలు లేదా సూర్య పటాలు ఉంచడం వల్ల అననుకూల ప్రభావాలు ఉంటాయి.
  • దుర్గాదేవి శక్తి స్వరూపం. కానీ ఇంట్లో మూడు దుర్గా విగ్రహాలు ఉంచినట్లయితే, అది గృహ జీవితానికి అనుకూలమైనది కాదని అంటారు.

ఇలా మీరు కొలిచే ఏ దేవి దేవతల విగ్రహాలైన.. పటాలైన.. పూజా గది మినహా అలంకారం కోసమో, గోడకు ఉంచడం కోసమో పొరపాటున పెట్టాలనుకున్నా.. ఒకటికి మించి ఇంట్లో ఉంచరాదు. కొలవరాదు.