
అలనాటి ప్రాచీన వైభవానికి…మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు దేవాలయాలు. భారత దేశంలో వేళ్ల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత..ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాగే ఆలయాల్లోని గాలిగోపురానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. వాటి పైన ఉండే అపురూపమైన శిల్పకళా సంపద భవిష్యత్ తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అలాంటి వెయ్యిళ్ల చరిత్ర కలిగిన…చాళుక్యుల కాలంలో నిర్మించిన అశేష శిల్పకళా సంపదకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న గాలిగోపురంపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ.
ఏలూరు సిటీకి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శనివారపు పేటలో కనిపిస్తున్న ఈ ఎత్తయిన గాలిగోపురం చెన్నకేశవ స్వామి ఆలయంలోని గాలిగోపురం. 100 అడుగుల ఎత్తులో అశేష శిల్పకళా సంపదతో ఈ ఆలయం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ గోపురం నిర్మానం ఇప్పటిది కాదు. 11వ శతాబ్దం చాళుక్యల కాలంలో జరిగినట్లుగా పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. చాళుక్యు రాజుల కాలంలో గోపురం నిర్మాణం జరిగినప్పటికీ …ఆతర్వాతి కాలంలో అప్పటి జమీందార్లు ఆలయానికి పోషకులుగా ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఈ గోపురంపై ఆనాటి చాళుక్యుల రాజుల సంస్కృతి సాంప్రదాయాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అంతే కాదు రామాయణం ,శ్రీరామ పట్టాభిషేకం ,మహాభారతం, భాగవతం లాంటి పురాణ ఇతిహాసాలు క్షీర సాగర మదనం, యక్షులు, గంధర్వులు ,కిన్నెరలు కిమ్ పురుషులు ఆల్వార్లు, ఋషులు ,మునులు, వాత్సాయన కామసూత్ర సంబంధించిన శిల్పాలను శాస్త్రీయ విధానంలో చెక్కారు. ఈ శిల్పాలు ప్రాచీన వైభవానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. పూర్తిగా ఇసుకరాతి శిలతో నిర్మితమైన ఈ గాలిగోపురం కొన్నేళ్ల క్రితం శిథిలావస్థకు చేరింది. అయితే 2004లో గోపురం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
ఏలూరుకు చెందిన ఆధ్యాత్మికవేత్త అయ్యంగార్ చొరవతో.. అనేక పోరాటాల తర్వాత గోపురం పునర్నిర్మాణానికి నోచుకుంది. గోపురం వైభవం దెబ్బతినకుండా..పాడైన వాటిని మాత్రమే తొలగించి వాటి స్థానంలో సున్నం బెల్లం కరక్కాయ జనపనార పొట్టు తుమ్మచిగురు మిశ్రమాన్ని ఉపయోగించి శిలా సంపాదన తిరిగి రూపొందించారు. చెన్నై ఐఐటి వరంగల్ నెట్ ప్రొఫెసర్లు రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు గాలి గోపురం పునర్నిర్మాణ విషయంలో అందించిన పలు సూచనలు , సలహాలతో పనులు చేపట్టి ఆలయానికి పున:వైభవాన్ని తీసుకువచ్చారు.
ఈ శైవ క్షేత్రం ప్రసత్తుం ద్వారకా తిరుమల దత్తత ఆలయంగా ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన శిల్పకళా సంపదతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రానికి తల మాణికంగా నిలుస్తోంది . ప్రాచీన వైభవానికి ప్రతీకగా ఉన్న ఈ గోపురం మరో 400 ఏళ్ల వరకు పటిష్టంగా ఉండాలి అంటే ఆలయం ముందున్న రహదారి పై భారీ వాహనాల రాకపోకలను మళ్లించాలని నిపుణుల నివేదికలు చెబుతున్నాయి. 2013- 14 లోనే ప్రొఫెసర్లు దేవాదాయ శాఖకు నివేదికని అందజేసినా ఇప్పటికీ అది అమలుచుకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి..వెయ్యేళ్ల నాటి చాళుక్య రాజుల కాలం నాటి ఈ ప్రాచీన గోపురం వైభవాన్ని.. భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.