
హిందూ ధర్మం ప్రకారం పూజల్లో విధిగా చేసే దీపారాధన అత్యున్నతమైనది. అయితే ఈ దీపారాధనలో కొన్ని రకాల ఉపచారాలు, విధానాలు ఉన్నాయి. దీపం వెలిగించడం ఒక రకం అయితే..
అఖండ దీపం వెలిగించడం మరొక రకం. చాలామంది పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు.. అఖండ జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపం పట్ల జాగ్రత్త వహిస్తూ.. దీపం కొండెక్కకుండా.. కొనసాగింపుగా నూనెను పోస్తూ ఉంటారు. దీన్ని వెలిగించడం, సంరక్షించడం అనేది చాలా ఓపికతో కూడుకున్న పని.
అఖండ జ్యోతిని వెలిగించిన తరువాత అది ఉండుండి శాంతం అయిపోతే అపశకునంగా భావిస్తారు. చాలామందికి అఖండ జ్యోతి గురించి తెలియని విషయాలు.. పాటించాల్సిన నియమాలు అంతే స్పష్టంగా తెలియకపోవచ్చు. అవగాహన పెంచుకుంటే సరే!
ఏదైనా పూజ, వ్రతం సమయంలో.. దీన్ని ఒకరోజు, మూడురోజులు, తొమ్మిదిరోజులు అంటూ ఇలా చేసుకునే పూజ, వ్రతాన్నిఅనుసరించి వెలిగిస్తుంటారు. దేవీనవరాత్రులు, వినాయక నవరాత్రులు మొదలైన పూజలతో పాటు అమావాస్య రోజుల్లో కూడా అఖండ దీపం వెలిగిస్తారు.
అఖండ దీపాన్ని వెలిగించడానికి పెద్ద ప్రమిదను వాడాలి. చిన్న చిన్న ప్రమిదల్లో ఈ దీపాన్ని వెలిగించడం, సంరక్షించడం కష్టం. నువ్వుల నూనె, ఆవనూనె లేదా నెయ్యిని ఇందుకు ఉపయోగిస్తారు. అలాగే దీపాన్ని వెలిగించే స్థలంలో గాలి ఎక్కువగా ఉండటం, దీపాన్ని ఉంచే ప్రదేశం ఇరుకుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చాలామంది ఉపవాసం ఉంటూ అఖండ దీపాన్ని వెలిగించి దేవుడి ధ్యానం, జపంలో ఉంటూ దీపాన్ని గమనిస్తూ.. దేవుడి సమక్షంలో సమయం గడుపుతూ ఉంటారు.
అనుకోకుండా అఖండ జ్యోతి కొండెక్కితే నిరాశ పడకుండా మళ్ళీ స్నానం చేసి.. ఏ దేవతను ఆరాధిస్తూ అఖండ జ్యోతిని పెట్టారో.. ఆ దేవత నామాన్ని 108సార్లు జపం చేసి మళ్లీ దీపాన్ని వెలిగించవచ్చు.
అఖండ దీపాన్ని సంరక్షించే ఓపిక, ఆసక్తి లేనప్పుడు ఆర్భాటం కోసం ఎప్పుడూ వెలిగించకూడదు. అలా చేస్తే కలిగే మేలు కన్నా కీడు ఎక్కువగా ఉంటుందనీ తెలుసుకుంటే మంచిది.