
పుష్కరాలు అనేవి పుణ్య నదులకు ప్రతి పన్నెండేళ్లకోసారి వస్తుంటాయి. సాధారణంగా పుష్కరాలు ఏడాది కాలంపాటు ఉంటాయి. ఐతే ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అంటూ మొదటి 12 రోజులు లేదా చివరి పన్నెండు రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు.
మన హిందు ధర్మం ప్రకారం.. జలానికి దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం సంప్రదాయంగా అలవడింది. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు ఆ సాంప్రదాయంలో భాగంగా వచ్చాయి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని మన పెద్దల విశ్వాసం. అందువల్లే పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భావిస్తారు. అలాగే పుష్కర సమయంలో పితృదేవతలకు చేసే పిండప్రదానాలు వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేథయాగం చేసినంత పుణ్య ఫలితాన్నిస్తుందని నమ్ముతారు.
నర్మదా నదిలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశిలో మరణం ఎంత మోక్షప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేదరుషులు వంటి వారు చెబుతారు.
ఎలా ఆచరిస్తారు..
నదిజలాలను చేతిలోకి మూడుసార్లు తీసుకుని.. ఒడ్డుకు వచ్చి నీళ్లలో నిలబడి శ్లోకాలను పటిస్తూ.. కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడుసార్లు ఒడ్డుమీద పిండాలి. ధరించిన వస్త్రాలను వదులుకుని, నూతన వస్త్రాలను లేదా పొడివస్త్రాలను ధరించాలి. అనంతరం సూర్య ధ్యానం చేయడం ఉత్తమం. పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జప, ధ్యాన, అర్చన, గాన, తర్పనాది అనుష్టానాలకు, పితృపిండ ప్రదానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెబుతారు.
ఏమేం దానం ఇవ్వొచ్చు..
ఈ కర్మల వల్ల శారీరక, మానసిక, బుద్ధి కల్మషాలు వంటివి తొలగి మనశ్శాంతి అనేది లభిస్తుంది.
బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణాలు, ఔషధాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, తేనే, పీఠం, అన్నం, పుస్తకం ఇలా మొదలైనవి వారి శక్తికి తగిన విధంగా దానంగా ఇస్తే… సుఖసంతోషాలతో ఉంటారు. భూదానం చేయడం వల్ల భూపతిత్వం, వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసులోక ప్రాప్తి, గోవును దానంగా ఇస్తే రుద్రలోక ప్రాప్తి, నెయ్యిని దానంగా ఇస్తే ఆయుష్షు వృద్ధి, ఔషధాన్ని దానంచేస్తే ఆరోగ్యవంతులవుతారు. సాలగ్రామం దానం చేస్తే… విశ్వలోకాల ప్రాప్తి, తిలదానం వల్ల ఆపదలు అనేవి దరి చేరవని మన పురాణాలు చెబుతున్నాయి.