కూర్మావతారం..!

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసమే ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తిన విషయం విదితమే..
అందులో రెండో అవతారం.. కూర్మావతారం. కూర్మము అనగా తాబేలు. కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టారు. ఇందుకు మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని, దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగించింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు స్వయంగా నారాయణుడే కూర్మరూపం దాల్చి, సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. ఇది కృతయుగంలో సంభవించిన అవతారం. శ్రీ కూర్మ జయంతి నాడు “శ్రీకూర్మం” క్షేత్రాన్ని దర్శించుకొని తరించాలని పెద్దలు చెబుతుంటారు.

కూర్మం స్థిరత్వానికి ప్రతీక. కూర్మం అంటే ప్రపంచానికి ఆధారమైనవాడు, సృష్టికర్త అర్థం వస్తుంది. తాబేలు తన ధర్మం ప్రకారం…
నీటిలోనీ క్రిములను, మురికిని నశింపజేసే గుణం సహజంగానే ఉంది. అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది. లౌకిక అర్థంలో సాధారణ నీటిలో ఉన్న క్రిములను నశింపజేసేది అయితే, ఆధ్యాత్మిక కోణంలో భవసాగరంలో మునిగిన మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే క్రిములను నశింపజేసేవాడు కూర్మనాథుడు అని అర్థం స్ఫురిస్తుంది.

కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువనే చెప్పాలి. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా కీర్తించబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా అనాదిగా విరాజిల్లుతోంది.

ఈ క్షేత్రం దేవతలచే నిర్మించబడిన ఆలయంగా పేరు పొందింది. అందుచేత ప్రతిరోజు రాత్రి వేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయ్యేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. శ్రీ కూర్మంలోని స్వామివారి పుష్కరిణి ఉంది. దీన్నే ‘శ్వేతగుండం’ అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలి దోషాలు ఎవున్నా తొలగిపోతాయని నమ్మకం. అంతేకాక మరణించినవారి అస్తికలను ఈ గుండంలోనే కలుపుతారు. ఈ గుండంలో స్నానం ఆచరించి, ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమగతులు కలుగుతాయని విశ్వాసం.