‘ఓంకారం’లోని విశిష్టత..!

ఓం అనే శబ్దంలో ‘అ’ కారం తో ప్రారంభమై ‘మ’ కారంతో అంతమవుతుంది. ఈ విశ్వంలోని శబ్దాలన్నీ వీటి మధ్యనే ఉంటాయి. అన్ని ధ్వనులూ ఓంకారంలో పుట్టి, దానిలోనే అంతమవుతాయి. అందుకే ఓంకారాన్ని శబ్ద బ్రహ్మామనీ, నాద బ్రహ్మమనీ, అనాహత శబ్దమనీ చెబుతున్నాయి వేదాలు. ఓంకారమే ప్రణవ మంత్రం, ఆదిమంత్రం. అన్ని బీజమంత్రాలకూ మూలం ఓంకారమే. అందుకే ఓంకారాన్ని ‘మహా బీజమంత్రం’గా పిలుస్తారు.
అంతేకాదు ఓంకారం దేవతల జన్మస్థలం అనీ, అలాగే, ఓంకారం సగుణ, నిర్గుణ బ్రహ్మాలను నిర్దేశిస్తుందనీ రుగ్వేదం చెబుతోంది.

ఇక ఉపనిషత్తుల్లో ఇలా రాసి ఉంది…
భగవత్ సాక్షాత్కారానికి దరి చేర్చే వాహనం లాంటిది ఓంకారం అని అమృతబిందూపనిషత్,
ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. నాలుగు వేదాలూ ఓం కారానికి నాలుగు పాదాలు వంటివి అని అధర్వశీరోపనిషత్,
ముముక్షువులు పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ధ్యానించాలaని ధ్యానబిందూపనిషత్ లు తెలుపుతున్నాయి.

ఓంకారం అనేది మోక్ష మంత్రం.
దీనివల్ల జీవుడు సంసార సాగరాన్ని దాటగలడు. ఈ మంత్రాన్ని గనుక మనసులో కానీ, బిగ్గరగా కానీ ఉచ్చరించడం వల్ల ఆలోచనలు, కర్మలు ఓం కారమనే దివ్యసూత్రంలో చేరి, భగవదర్పితం అవుతుంది.
జీవాత్మ – పరమాత్మలను అనుసంధానం చేసి, తద్వారా “అసి” అనే పదం ద్వారా ఆ రెండింటినీ ఏకం చేసేది ఓంకారం అని హయగ్రీవోపనిషత్,
ఓం కారాన్ని జపించడం వల్ల మన అజ్ఞానం పోయి.. జనన మరణాల నుంచి విముక్తుడై, సత్యసాక్షాత్కారాన్ని పొందుతాడని కైవల్యోపనిషత్ లో ఓంకారం విశిష్టతను గొప్పగా చెప్పాయి.