
అరుణాచలం ఒక శైవ క్షేత్రం. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు, శైవభక్తులకు అరుణాచల క్షేత్రం గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి అరుణాచలంలో శివుడు వెలసి ఉన్నాడని తెలుసు. కానీ ఆ క్షేత్ర విశిష్టత తెలసినవారు మాత్రం కొందరే ఉంటారు. ఈమధ్య కాలంలో అరుణాచల క్షేత్రం దర్శనం, గిరి ప్రదక్షిణ గురుంచి సోషల్ మీడియాలో తెగ వీడియోలు వస్తున్నాయి.
అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడి అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని, ఆ స్వామి దర్శనం జరగదని అంటుంటారు. అదే విధంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా విశిష్టత ఉంది. ఇంతకీ అరుణాచల క్షేత్ర చరిత్ర, దర్శనం ఎలా చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం:
శివుడు పంచభూతాలను ఆవరించుకుని ఉంటాడు. అలానే పంచభూతాలలో ఒక్కో స్వరూపానికి గుర్తుగా ఒక్కోచోట శివలింగాలు వెలిశాయి. ఇవి కూడా స్వయంభుగా వెలిసిన లింగాలే. పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి. ఆ అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంగా శివుడు అవతరించిన పవిత్రప్రదేశమే ఈ అరుణాచలం.
అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి.
పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరినే సాక్షాత్తూ దైవస్వరూపంగా భావిస్తారు.
అరుణాచలం దర్శించే చాలామంది భక్తులు అరుణగిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటారు. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు ఉంటుందని చెబుతారు. ఈ గిరి ప్రదక్షిణలో మరొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు కూడా జన్మజన్మల పాపాలను కడిగేస్తుందట. చాలామంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తారు. మరికొందరు మాత్రం పౌర్ణమి తిథి చూసుకుని మరీ ఈ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తారు.
గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా శివలింగాలను దర్శనం చేసుకుంటాం. వీటిలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమ లింగం, నైరుతి లింగం,వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం అనే ఎనిమిది లింగాలతో పాటు అనేక ఇతర దేవాలయాలు, తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు.
చాలామందికి తెలియని విషయమేమిటంటే.. సిద్దులు.. (అష్టసిద్దులు పొందిన వారు, దైవిక శక్తులు సాధించినవారు) యతీశ్వరులు..(ముల్లోకాలను జయించినవారు.. ముల్లోకాలు అంటే భూలోకం, స్వర్గలోకం, భువనం. ఈ మూడు లోకాలలో ఉన్న సుఖాలను తుచ్చప్రాయంగా వదిలేసినవారు, కఠిన సాధన చేసేవారు యతీశ్వరులవుతారు)
అరుణగిరి ప్రదక్షిణకు, దర్శనానికి వస్తారని అంటుంటారు. అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు.. కేవలం అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందవచ్చు. ఆ అరుణాచల పరమేశ్వరుడిని అరుణాచల శివ, అరుణాచల శివ అని ధ్యానించినంతనే జన్మజన్మల పాపాలు పోతాయి. జీవితంలో ఒక్కసారైనా అరుణాచల దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు.