
ఇంట్లో వ్యక్తిగత అవసరాలకు, ఎదుగుదలకు డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటారు. ఆ తల్లి అనుగ్రహం పొందడం కోసం కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం:
శ్రీ ఫలం..
పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ కొబ్బరికాయని లఘునారికేళం అని అంటారు. చూడ్డానికి అచ్చం మనం కొట్టే కొబ్బరికాయ ఆకారంలో ఉన్నా.. ఇది రూపంలో అత్యంత చిన్నదిగా ఉంటుంది.
లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది. అందువల్ల ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని ఎల్లప్పుడూ పూజగదిలో ఉంచవచ్చు. ఏల్నాటిశనితో బాధపడుతున్నవారూ, వ్యాపారంలో వృద్ధిని కోరుకునేవారు ఈ శ్రీ ఫలాన్ని పూజగదిలోగాని, బీరువాలో గాని, డ్రాలో ఉంచితే ఎనలేని సంపద, విజయం దక్కుతుంది.
శ్రీ సూక్తం..
అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలో దాగి ఉన్నాయి. శ్రీసూక్తాన్ని నిత్యం పఠించడం వల్ల అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారు. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే ఇంకా మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ ప్లే చేస్తూ.. విన్నా శుభఫలితం ఉంటుంది.
శ్రీ చక్రం..
తంత్రవిద్యలో శ్రీచక్రం/ శ్రీ యంత్రానికి ఉన్న వేరే చెప్పనక్కర్లేదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని యంత్ర, తంత్ర గురువులు చెబుతారు. ఇలా ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో విశిష్టత ఉంది. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానిని ‘మేరు ప్రస్తారం’ అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీ యంత్రాన్ని కానీ పూజగదిలో నిత్యం ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని అంటారు.
తామరపూలు..
లక్ష్మీదేవి సముద్ర మధనంలో ఆవిర్భవించిందని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఆమెకు నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామరగింజలతో పూజిస్తే మరింత మేలు జరుగుతుందనీ చెబుతారు. దీంతోపాటు లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే గనుక విశేషమైన ఫలితం లభిస్తుంది.