శని జన్మదినోత్సవం నేడు.. ఏమేం చేయాలంటే..?!

కర్మల దేవుడిగా కొలిచే శని జన్మదినోత్సవమే శని జయంతి.. ఏటా వైశాఖ అమావాస్యనే శని అమావాస్యగా, శని జయంతిగా పిలుస్తారు. సూర్యభగవానుడు, ఛాయల కుమారుడే శని. ఈ ఏడాది శని జయంతి మే 27న మంగళవారం వచ్చింది. తిథి ప్రకారం చూస్తే మే 26, 2025 సోమవారం ఉదయం 11 గంటల 20 నిముషాలకు ప్రారంభమై, మే 27, 2025 మంగళవారం నాడు ఉదయం 8 గంటల 55 నిముషాల వరకు ఉంది.

సాధారణంగా అమావాస్యరోజున రాత్రివేళలో పూజ నిర్వహిస్తారు. కానీ ఇవి జయంతి వేడుకలు కావడంతో సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అంటే శని జయంతి ఈ మే 27 మంగళవారం రోజున వచ్చిందని గ్రహించాలి.

శని జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేస్తే మీ జీవితంలో వృద్ధి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఈరోజున నల్ల నువ్వులను తప్పకుండా దానం చేయండి. ఈ దానం చాలా శుభప్రదం. నల్ల నువ్వులను మీరు శనిదేవునికి నూనె సమర్పించేటప్పుడు కూడా వేయొచ్చు.

ఆవనూనెను సమర్పించడం చాలా మంచిది. ఈ రోజు శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి, అందులో నల్ల నువ్వులు కూడా వేయండి మేలు చేస్తుంది.

నల్ల వస్త్రాలను దానం చేయాలి. నల్ల దుస్తులు లేకుంటే ఏదైనా రంగు దుస్తులను అయినా దానం చేయొచ్చు. వస్త్రదానం చేయడం ముఖ్యం.

అవసరమైనవారికి చెప్పులు దానం చేయండి. శని జయంతి వేసవి కాలంలో వస్తుంది. అందువల్లే చెప్పులు, కుండ, మజ్జిగ దానం చేయడం లేదంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం శుభాన్నిస్తుంది.