నేడు.. మోహినీ ఏకాదశి..!

హిందూ సంప్రదాయం ప్రకారం మోహినీ ఏకాదశి ఉపవాసం చాలా ప్రత్యేకం. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథినాడు దీనిని ఆచరిస్తారు. ఈ ఏడాది మే నెల 8న, గురువారం వచ్చింది. మోహినీ ఏకాదశి ప్రాముఖ్యత, వ్రత కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం:

మోహినీ ఏకాదశికి సంబంధించి సముద్ర మథనం జరుగుతున్న సమయంలో అమృతం ఉన్న పాత్ర లభించినప్పుడు దేవతలు, అసురుల మధ్య అమృతాన్ని పంచుకోవడంలో గందరగోళం ఏర్పడింది. దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తిమంతులు కావడంతో రాక్షసులు.. దేవతల మీద ఆధిపత్యం చెలాయించడం మొదలు పెట్టారు.

ఈ దుర్మార్గాల నుంచి కాపాడేందుకు దేవతలందరూ విష్ణువును అభ్యర్థించగా.. విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి, రాక్షసులను తన భ్రమలో పడేసి.. దేవతలకు అమృతాన్ని తాగడానికి ఇచ్చాడు. దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు. అందుకే ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశిగా పిలుస్తారు.

మోహినీ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాయ/ భ్రమ అనే ఉచ్చు నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని చెబుతారు.ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి పాపాలు నశిస్తాయి. మోహినీ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.

మోహినీ ఏకాదశి వ్రత కథ..

ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతడికి ఐదుగురు కుమారులు. వారిలో చిన్న కుమారుడు దృష్టబుద్ధి. ఇతడు పాపకార్యాలు ఎక్కువగా చేస్తాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కొడుకును ఇంటి నుంచి గెంటేశాడు. అలా గెంటేసిన తరువాత నిరాశ్రయుడుగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా అతడ్ని విడిచిపెట్టారు.

దృష్టబుద్ధి ఆకలి దప్పులతో అల్లాడుతూ కౌండిల్యుడి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటాడు. అది వైశాఖ మాసం… రిషి గంగానదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత.. అతడికి జ్ఞానం వచ్చింది. కౌండిల్య మహర్షికి నమస్కరించి.. ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకుంటాడు.

ఆ విధంగా కౌండిల్యుడు దృష్టబుద్ధిపై జాలిపడి వైశాఖమాసంలో వచ్చే మోహినీ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు. ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణాలు పొందిన ఇతడు ఆ పుణ్య ప్రభావంతో పాపరహితుడయ్యాడు. జీవిత చరమాంకంలో గరుడపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్లాడు. అందువల్ల మోహినీ ఏకాదశికి అంత ప్రాముఖ్యత వచ్చింది.

ఈరోజు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించి సంతోషకరమైన జీవితం గడుపుతారు. మనసు శుద్ధి అవుతుంది. ఈరోజున సూర్య పురాణం చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం జపిస్తూ మోహినీ ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెబుతారు.