శనివారం ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదంటే..?!

కర్మ ఫలాలను ఇచ్చేవాడు, న్యాయ దేవుడుగా పరిగణించే శనిదేవుడికి శనివారం చాలా ముఖ్యం. శని అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శ్రేయస్సు, స్థిరత్వం సిద్ధిస్తాయి. అయితే శని చెడు దృష్టి జీవితంలో సమస్యలను, ఇబ్బందులను మరింత పెంచుతుంది. కాబట్టి శని దేవుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి సరైన రంగు దుస్తులు ధరించడం ఎంతో మంచిది. అలా చూసుకుంటే ఏ రంగు దుస్తులు ధరించాలి, ఈరోజు ఏయే పనులు చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం:

ఏ రంగు మంచిది..
శనివారం నాడు ముదురు రంగులు, గంభీరమైన వ్యక్తిత్వాన్ని చూపే రంగుల దుస్తులను ధరించడం మంచిది. ముఖ్యంగా నలుపు, ముదురు నీలం, ముదురు గోధుమ, ఊదా రంగు దుస్తులు ధరించడం వల్ల శని నుంచి సానుకూల శక్తి లభిస్తుంది. ఈ రంగులు శని దేవుడికి ప్రియమైనవి.ఈ రంగుల దుస్తులను ధరించినప్పుడు, శనిదేవుడి శక్తి జీవితంలో అడ్డంకులను తగ్గించి, పనిలో విజయాన్ని తెస్తుందని చెబుతారు.

ఏ రంగు ధరించకూడదు..
తెలుపు, గులాబీ, లేత నీలం లేదా లేత ఆకుపచ్చ వంటి లేత, ప్రకాశవంతమైన రంగులను ధరించకుండా ఉండాలి. ఈ రంగులు శని ప్రభావాన్ని బలహీనపరుస్తాయి. జీవితంలో ఇబ్బందులను తెస్తాయి.

శనిదేవుడి ఆశీర్వాదం లభించాలంటే..

శనిదేవుడి ఆశీర్వాదం పొందడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా చేయవచ్చు. శనివారం ఉదయం స్నానం చేసి, రావి చెట్టుకు నీళ్ళు అర్పించడం.. లేదా గంగా జలం, నల్ల నువ్వులు, చక్కెర, పాలు కలిపిన నీటిని సమర్పించడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడట.

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన్ను పూజించడంతో పాటు దానం చేయడం కూడా మంచిది. ఈరోజున మినపప్పు, నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు, ఆవాల నూనె, నల్ల బట్టలు, బూట్లు దానం చేయడం వల్ల శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి.

శని దేవుడి మంత్రాన్ని కనీసం ఐదుసార్లు జపించడం వల్ల శని అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు. శనివారం శని ఆలయంలో ఆవ నూనె దీపం వెలిగించడం కూడా ప్రయోజనకరం.

ఎవరైనా శని దోషం, ఏలినాటి శని, శని మహాదశ వంటి వాటితో బాధపడుతుంటే వారు శనివారం నాడు నల్ల కుక్క, ఆవు లేదా కాకికి ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి, శని దేవుడి ఆశీస్సులు అలాగే ఉంటాయి.

శనివారం నాడు శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠించడం కూడా శుభప్రదం.