
మనం చేసే పనులను కర్మలు అంటారు. ఆ కర్మల వల్ల కలిగే ఫలితాలు కొన్ని సంతోషాన్ని అందిస్తే.. కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి. ముఖ్యంగా రమణ మహర్షి ఈ అంశంలో చెప్పిన విషయాన్ని తెలుసుకుంటే ఇహ కర్మల గురించి ఆలోచన, సంతోషాలు, దుఃఖాలు అనే ఆందోళన అసలు మన దరి చేరదు.
అసలు ఎవరైనా ఏ కోరికా, ఏ ప్రయోజనం లేకుండా కర్మలు చేస్తారా? అంటే ఎవ్వరూ చేయరు. దాని వెనుక ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. సుఖం కలగాలి, లాభం రావాలి. పేరు రావాలి, పుణ్యం రావాలి, కీర్తి ప్రతిష్టలు పెరగాలి.. మనసుకు తృప్తి కలగాలి.
కానీ రమణులు.. నిష్కామ కర్మ యోగం గురుంచి చెబుతూ.. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా.. అసలు ఏ కోరికా లేకుండా ఒక పని చెయ్యలేమా?
మంచి జరగాలని, శుభం కలగాలని ఆశించవచ్చు. కానీ ఏం మంచి జరగాలి, ఎంత జరగాలి? అనే నిర్దిష్ట భావాలు ఉండకూడదు. అంటే ‘మనం చేసే కర్మల వల్ల ‘ఫలానా’ ప్రయోజనం సిద్ధించాలి’ అని ముందుగానే ఊహించకుండా, భావించకుండా, ఆశపడకుండా చెయ్యమని మాత్రమే తెలుపుతుంది.
మన దృష్టి కర్మఫలం మీద కాకుండా కర్మల మీదనే అంటే చేసే పనిమీద ఉంచి.. నైపుణ్యం, నిష్టతో కర్మలు చెయ్యటమే నిష్కామ కర్మ యోగంగా భావించాలి.
అందుకే ‘యోగః కర్మసు కౌశలం’ కర్మలలో నైపుణ్యమే యోగం అని భగవానుడు మనకు గీతలో చెప్పాడు. కాబట్టి కర్మలను నైపుణ్యంతో చేస్తే అవి బంధంకాక పోగా మోక్షప్రాప్తికి సహాయకారులవుతాయి. నిజానికి కర్మల వల్ల ఎవరికీ సుఖదు:ఖాలు కలగట్లేదు. ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలపై విపరీతమైన ఆసక్తి ఉండటం వల్ల, ఫలానా ఫలితాన్ని నేను పొందాలి అనే భావన వల్ల.. ఆశ వల్ల సుఖదు:ఖాలు కలుగుతున్నాయి. బంధ కారణాలవుతున్నాయని గ్రహించాలి.