
కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. బ్రకోలీ క్యాబేజీ రకానికి చెందినది. ఇవి మార్కెట్‌లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. బ్రకోలీని ఉడికించి లేదా వండకుండా కూడా సలాడ్‌లా తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటంటే..
బ్రోకలీలో విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లుగా పిలిచే పిగ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఆకుకూరను రెగ్యులర్ గా తినేవారిలో, జన్యుపరమైన వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పలు హెల్త్ అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఆర్థరైటిస్ నివారణకూ బాగా సాయపడుతుంది. అలాగే, పొట్ట, జీర్ణవ్యవస్థలో ఉన్న సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. బ్రోకలీ, అరటిపండులో ఉన్న ఫైబర్, మన పేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది.
క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉన్న కణాల వృద్ధిని సల్ఫోరాఫెన్ అడ్డుకుంటుంది. తద్వారా
ప్రొస్టేట్ క్యాన్సర్‌నూ తగ్గిస్తుంది. పీటీఈఎన్ జన్యువు శరీరంలో తక్కువగా లేదా క్రియాశీలకంగా లేనప్పుడు, ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. మానవుల ప్రొస్టేట్ కండరాలపైనా, ఎలుకలపైనా చేసిన అధ్యయనంలో, క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉన్న కణాల వృద్ధిని సల్ఫోరాఫేన్ అడ్డుకుంటుందని గుర్తించింది.
పీటీఈఎన్ అనేది క్యాన్సర్‌ను అధిగమించే జన్యువు. ఇది పాడైనా లేదా చురుకుగా లేకపోయినా ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
బ్రకోలీని తింటే చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. దీనికి కారణం బ్రకోలీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది.
బ్రకోలీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అయి, వేడి వాతావరణంలో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు సాయపడుతుంది.
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ లాంటివి ఉండటం మూలానా హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. బ్రకోలీ తింటే హార్మోన్ అసమతుల్యత సమస్య తీరుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో బ్రకోలీ ముందుంటుంది. దీనిని తీసుకోవడం వల్ల దృష్ఠి సమస్యలు తగ్గుతాయి. ఇమ్యూనిటీని పెంచడంలో కూడా బ్రకోలీ చాలా మంచిది. రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ను ఇస్తుంది. అయితే థైరాయిడ్ ఉన్నవారు తినకపోవడమే కాస్త మంచిది.