ఎండలో చెరకు రసం తాగుతున్నారా.. అయితే మీకోసమే!

వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని, శక్తిని అందించడానికి చెరకు రసం ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో ఎక్కడైనా అందుబాటులో దొరుకుతుంది. మండే వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. వాటర్ కి బదులుగా చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, దాహం కూడా తీరుతుందని మనం అనుకుంటాం. కానీ ఎక్కువ సూర్యకాంతిలో చెరకు రసం తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుందట. దీన్ని తాగే సమయం, పద్ధతి సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణమట.


మండే ఎండకు శరీరం ఇప్పటికే వేడిగా మారి ఉంటుంది కదా.. చల్లని చెరకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం సమస్యలను కలిగిస్తుంది. చెరకు రసం సహజంగా చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో చెమటతో కూడిన శరీరం అకస్మాత్తుగా ఏదైనా చల్లని పదార్థాన్ని తీసుకున్నప్పుడు అది గొంతు నొప్పి లేదా జలుబు దగ్గుకు దారితీస్తుంది.
కాబట్టి చెరకు రసం చాలా చల్లగా ఉండకూడదు.

బహిరంగ ప్రదేశాల్లో విక్రయించే చెరకు రసంలో పరిశుభ్రత సరైన రీతిలో ఉండదు. అందువల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ లేదా కడుపులో ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు.
చెరకులో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఎండకు అలసిపోయిన శరీరానికి వెంటనే దీన్ని అందించడం వల్ల చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది తల తిరగడం లేదా అలసటకు కారణమవుతుంది.

  • చెరకు రసం తాగడానికి సరైన సమయం
  • ఉదయం లేదా మధ్యాహ్నం. సరాసరి ఎండలోంచి వచ్చిన వెంటనే తాగకూడదు.
  • నీడలో లేదా చల్లని ప్రదేశంలో కూర్చుని తాగాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణమవుతుంది.
  • ఖాళీ కడుపుతోనూ చెరకు రసం తాగకూడదు.

చెరకు రసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకుని తాగాలి. ఎల్లప్పుడూ తాజా చెరకుతో తయారు చేసిన రసాన్ని మాత్రమే తాగాలి. తాగిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.