
వారంలో తినే కూరగాయల్లో బెండకాయ ఒకటి కచ్చితంగా ఉంటుంది. కర్రీ, పులుసు, ఫ్రై, పచ్చడి ఇలా నచ్చిన రీతిలో చేసుకుని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే వంటల సంగతి పక్కన బెడితే, బెండకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవెంటంటే..
బెండకాయ కట్ చేసినప్పుడు జిగురుగా, స్టిక్కీగా ఉంటుంది. ఫైబర్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అధికంగా తినాలనే కోరికను అదుపులో ఉంచుతుంది కాబట్టి బరువు తగ్గొచ్చు. అలాగే బెండకాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బెండకాయ గింజలను వేయించి కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?.. ఈ సంప్రదాయం కాఫీ కొరత ఉన్న కాలం నుంచి అంటే పూర్వం యుద్ధ సమయంలో ప్రారంభమైందని చెబుతారు. ఇందులో కెఫెన్ లేనందున, కాల్చిన బెండకాయ గింజలు కాఫీ రుచిని కలిగిస్తుందని, కెఫెన్ వినియోగాన్ని తగ్గించుకోవాలనుకునేవారికి బెండకాయ గింజలు ప్రత్యామ్నాయంగా ఉంటాయన్నారు.
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ప్రజలు డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ పేషెంట్స్‌కు బెండకాయ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలోని ఇథనాలిక్తో పాటు ఓక్రా మ్యుసిలెజ్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని పేర్కొంది.
- బెండకాయలో విటమిన్ సి, కె, మెగ్నీషియం, ఫోలెట్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరుగుదలకు, విటమిన్ కె ఎముకలు ధృడంగా ఉండేందుకు సహాయపడతాయి. అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటివి వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
- బెండకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి దోహదపడుతుంది.
- ఎండాకాలంలో వేడి, ఉక్కపోత కారణంగా చెమట ద్వారా శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. అయితే బెండకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే ఇందులో మెగ్నీషియం వంటి పోషకాలు చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్ స్థాయిలను పెంచుతాయి.