చలువను పెంచే ఐస్ ఆపిల్..

ఎండకాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు.. చూసేందుకు తెల్లని మంచు ముద్దలా ఉంటూ.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే వీటిని ‘ఐస్‌ యాపిల్‌’గా పిలుస్తారు. పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తినే వీటిలో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. వేసవిలో విరివిగా దొరికే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. చలువ కూడా చేస్తుంది.

  • తాటి ముంజల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి క్యాన్సర్‌, యాంటి డయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి.. వివిధ వ్యాధులను దరిచేరనీయకుండా.. మన ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి.
  • తాటిముంజల్లో నీటి శాతం ఎక్కువ. కాబట్టి, వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. వడదెబ్బకు గురైనవారికి ఇవి ఇస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.
  • శరీరానికి కావాల్సిన మినరల్స్‌, చక్కెర పదార్థాలు అంది.. శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరాన్ని చల్లబరచడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • ఇందులో అధికంగా లభించే ఫైబర్‌.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
  • ఇక తక్కువ కేలరీలు కలిగిన వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
  • ఫైటోకెమికల్స్‌, ఆంథోసయనిన్‌ లాంటివి శరీరంలో వివిధ రకాల ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కణాలను అభివృద్ధి చేస్తాయి. వీటిని తాటి ముంజలు నిర్మూలిస్తాయని పలు పరిశోధనలు రుజువు చేశాయి.
  • పొటాషియం.. కాలేయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
  • చాలామంది గర్భిణులు మలబద్ధకం, అసిడిటీ సమస్య ఉంటుంది. అలాంటప్పుడు తాటిముంజలను తీసుకుంటే.. వారి జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అసిడిటీ, మలబద్ధకం తగ్గుముఖం పడతాయి.
  • ఎండల్లో తిరగడం వల్ల ముఖంపై వచ్చే చిన్నచిన్న మొటిమల్లాంటి పొక్కులను పోగొడతాయి.
  • కొందరు ముంజలపై గోధుమరంగులో ఉండే పొట్టును తీసేసి.. కేవలం తెల్లటి పదార్థాన్ని మాత్రమే తింటారు. కానీ, ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయని, అది ఆరోగ్యానికి మరింత మంచిదని గ్రహిస్తే మరింత మేలు!