
వాతావరణంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఎండ వేడి వల్ల జుట్టు రాలిపోవడం లేదా పేలవంగా మారడం, చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా వానలో తడవడం, ఎండ తాకిడికి జుట్టు పెళుసుగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించాలంటే, పెరుగుతో జుట్టుకు మంచి పోషణ అందించాలి.
వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యానికి, జుట్టు సంరక్షణ విషయంలో బయట దొరికే ప్రొడక్ట్స్ తో పోలిస్తే, ఇంట్లో దొరికే సహజ పదార్థాల వల్లే మరింత మేలు జరుగుతుంది. అలాంటివాటిల్లో పెరుగు ఒకటి. పెరుగు జుట్టు పెరుగుదలకు మంచి సహాయకారి. పెరుగులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఇందులోని హెల్తీ ఫ్యాట్స్ జుట్టు పోషణకు సహకరిస్తాయి. కోల్పోయిన తేమను, పొడిగా మారిన, పెళుసైన జుట్టును మృదువుగా చేయ డంలో తోడ్పడుతుంది.
- పెరుగులో గుడ్డు మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. ఈ హెయిర్ మాస్క్ తలకు పట్టించి అరగంటసేపు ఉంచి, ఆపైన కడగాలి. దీనిని వారానికోసారి ఫాలో అయితే చాలు.
- పెరుగు, తేనె కలిపిన హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పెరగడమే కాదు. మృదువుగా మారుతుంది. ఇందుకు మొదటగా కప్పు పెరుగులో రెండు స్పూన్ల తేనె కలపాలి. ఈ హెయిర్ మాస్క్‌ను మూలాల నుంచి జుట్టు చివర్ల వరకూ పట్టించి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
- జుట్టు రాలడాన్ని అదుపు చేయాలంటే ఈ హెయిర్ మాస్క్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. హెయిర్ మాస్క్ కోసం 6 నుంచి 7 స్పూన్ల పెరుగు, రెండు స్పూన్లు తేనె, ఒక గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపూ లేకుండా తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
- పెరుగు మాస్క్ ఎక్కువసేపు తలకు పట్టించకూడదు. పెరుగులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు. దీనివల్ల జుట్టుకు ప్రోటీన్ ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది జుట్టు దృఢత్వం తగ్గి, వెంట్రుకలను విరిగిపోయేలా చేస్తుందని గుర్తుంచుకోండి.