కొబ్బరినీళ్లు తాగొచ్చు.. వారు మినహా..?!

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రకృతి సిద్ధంగా లభించే కోకోనట్ వాటర్‌లో బోలెడు పోషకాలు ఉంటాయి. సమ్మర్ లో చాలామంది తాగేందుకు ఇష్టపడతారు.. పైగా డీహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. అయితే చాలామందికి కొబ్బరినీళ్లు విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి.. ఎప్పుడు తాగితే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిది? అన్ హెల్తీగా ఉన్నవాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు ఇలా ఎవరైనా తాగొచ్చా.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం:

సాధారణంగా ఈ నీరు తాగితే డీహైడ్రేషన్‌ అవ్వకుండా, ఎండ వేడి తగ్గడంతో పాటు బరువుని అదుపులో ఉంచుకోవాలని అనుకునేవారికి ఇదొక మంచి పానీయంగా చెప్పవచ్చు. అయితే ఈ కొబ్బరి నీళ్లను సాయంత్రం పూట తాగడం కన్నా ఉదయాన్నే తాగడం మంచిదట. ఎందుకంటే శరీర జీవక్రియలకు అవసరమైన శక్తి ఆ టైంలోనే పెరుగుతుంది. తిన్నది జీర్ణం అయ్యేందుకు ఈజీ చేస్తుంది.

రక్తంలో అధిక మోతాదులో పొటాషియం నిల్వలు ఉన్నవారు కొబ్బరి నీరుకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే కొబ్బరినీళ్లలో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అప్పటికే అధిక పొటాషియం (హైపర్కలీమియా) ఉన్నవారు ఇది తాగితే పొటాషియం స్థాయి మరింత పెరిగి, గుండె సంబంధిత సమస్యలు తలెత్తొచ్చు.

అలాగే కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారు కూడా కొబ్బరి నీళ్లు తీసుకోవద్దు.. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయని రోగుల శరీరంలో పొటాషియం అనేది సరిగా బయటకు పోదు. అలాంటప్పుడు కొబ్బరినీరు తాగడం పొటాషియం నిల్వను మరింత పెంచుతుంది. ఇది వారి ఆరోగ్యానికి ప్రమాదకరం. కావున కొబ్బరి నీళ్లు తాగే విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సరే!