కీరదోసతో.. మరింత యవ్వనంగా..!

వేసవిలో విరివిగా దొరికే కీరదోస.. మండే ఎండల నుంచి రక్షణ కల్పిస్తుందంటే నమ్ముతారా..? సలాడ్ లో భాగంగా తీసుకునే కీరదోసలో సహజసిద్ధమైన సుగుణాలు.. మేనికి కొత్త మెరుపును తెస్తాయి. కీరదోసను తీసుకోవడం, వీటితో తయారైన ఉత్పత్తులను వాడటం వల్ల గ్లామర్ పెరిగి, అందంగా కనపడతారు.

బయట ఎండలకు బాగా అలసిపోయిన కళ్లకు ఉపశమనం కలిగించడంలో, కళ్ల కింది డార్క్ సర్కిల్స్ ను నిర్మూలించడంలో కీరదోస బెటర్ గా పనిచేస్తుంది. కళ్లు ఉబ్బినట్టుగా ఉంటే.. కీరదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే గమనిస్తే, ఎలాంటి ఫేషియల్‌ వేసుకున్నా.. కళ్లపై దోసకాయ ముక్కలు పెట్టుకోవడం మాత్రం పక్కా..

ఇందులో లభించే విటమిన్‌ కె రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్‌ సి, ఇ.. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

కీరదోసలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచే లక్షణం ఉంటుంది. దీనివల్ల ముఖం ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే గనుక ఫేస్ గ్లోయింగ్ గా, యంగ్ లుక్ లో కనిపిస్తుంది.

కీరదోసల్లో దాదాపు 95% నీరే ఉంటుంది. కాబట్టి ఎండలకు కందిపోయిన చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో లభించే యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మం ఎర్రబడటాన్ని తగ్గిస్తాయి.

ఇందులోని హైడ్రేటింగ్‌ సుగుణాలు కాస్త పొడి చర్మం సమస్యకు పరిష్కారం చూపుతాయి. చర్మాన్ని స్మూత్ గా మారుస్తాయి.

మొటిమలను తగ్గించడంలోనూ దోసకాయ బెటర్ ఆప్షన్. మొటిమల వల్ల కలిగే మంట, ఎరుపు, చికాకును ఇది తగ్గిస్తుంది. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి, మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిపించే విధంగా సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. తిరిగి మొటిమలు రాకుండా చూస్తుంది.

దోసకాయలో యాంటి ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలం. కాబట్టి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో బాగా పనిచేస్తాయి. అందువల్ల చర్మంపై ఒత్తిడిని తగ్గించి, గీతలు, ముడతలు, నల్ల మచ్చలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి.

దోసకాయ తొక్కలో విటమిన్‌ కె, సి, కాల్షియం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల.. హెల్తీ స్కిన్ ను అందిస్తాయి. అందువల్ల కీరదోసలను తొక్కతో తినేయడం ఉత్తమం!