అమెరికాలో ఇన్ సైడ్ ట్రేడింగ్ ? …

తను సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన ట్రంప్, ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చైనా మినహా అన్ని దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపేశాడు. ట్రూత్ సోషల్ ద్వారా ఇది కొనడానికి గొప్ప సమయం అంటూ పోస్ట్ చేసిన ట్రంప్, ఆ తర్వాత నాలుగు గంటల్లోనే సుంకాలను వాయిదా వేశాడు. దీంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా 9 శాతం పెరిగింది.
ఈ సమయంలో ట్రంప్ మీడియా స్టాక్ 22 శాతం పెరిగింది. దీంతో దీని వెనుక ట్రంప్ ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటే… స్టాక్ మార్కెట్లో ఇది ఒక అక్రమ ఆలోచన. బహిరంగంగా తెలియని సమాచారంతో స్టాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు లేదా అమ్మకాలు చేయడం. ట్రంప్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే సుంకాలు వాయిదా వేయడం, మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించడం వెనుక ఇదే తంతు ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు డెమోక్రాట్లు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నిర్ణయం వెనుక మార్కెట్ బాండ్ల పాత్రను కూడా డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీ నాటికి అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ 4.45 శాతానికి చేరింది. గతంలో ఇది 4 శాతం కంటే తక్కువగా ఉంది. బాండ్ ఈల్డ్ పెరగడం అంటే రుణఖర్చు పెరుగుతోందని అర్థం అవుతోంది. గతవారం స్టాక్ మార్కెట్ 5 నుంచి 10 శాతానికి పడిపోయింది. ఈ ఒత్తిడి వల్ల ట్రంప్ వెనక్కి తగ్గాడని నిపుణులు భావిస్తున్నారు. ఇది అమెరికా ఆర్ధిక వ్యవస్థను కాపాడే ప్రయత్నమా లేక లాభాల కోసమా అన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకున్నాడన్న ప్రశ్న కూడా ఇదే సమయంలో తలెత్తుతోంది. అయితే, దీనికి సమాధానం చెప్పిన ట్రంప్, గందరగోళాన్ని మరింత రెట్టింపు చేశారట. గత కొన్ని రోజులుగా సుంకాలపై ఆలోచిస్తున్నానని చెప్పడం వెనుక ఆంతర్యం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. సుంకాల విషయంపై ట్రంప్ సన్నిహితులకు ముందే సమాచారం ఉందని కూడా డెమాక్రాట్లు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ నిర్ణయంపై విచారణ జరపడంతో పాటు ఎవరు లాభాలు పొందారో కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు డెమాక్రాట్లు.

మరోవైపు ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణను వైట్ హౌస్ ఖండించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే, ట్రంప్ మీడియా స్టాక్ విలువ 3000 కోట్లకు పెరగడంతో పాటు టెస్లా స్టాక్ విలువ 1.5 లక్షల కోట్లు పెరగడంపై మాత్రం శ్వేతసౌధం నోరుమెదపలేదు. అంతేకాదు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేయడం అంటే, ఏదో జరుగుతోందన్న ప్రచారం ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి.