
ఉక్రెయిన్-రష్యా యుద్ధం 2022లో మొదలైనప్పటి నుంచి రష్యాకు ఎవరు మద్దతిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజాగా జెలెన్స్కీ షాకింగ్ ఆరోపణలు చేశారు. రష్యా తరపున చైనా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారని, ఉక్రెయిన్ సైన్యం ఆరుగురు చైనా సైనికులతో పోరాడి, ఇద్దరిని బంధించిందని చెప్పారు. ఈ ఆరోపణలతో యుద్ధం మరో మలుపు తిరిగింది. ఇది నిజమైతే ఈ యుద్ధం మరింత ఉధృతం కానుంది.
రష్యాకు ఎవరు సహకరిస్తున్నారు? మొదట ఉత్తర కొరియా పేరు బయటకు వచ్చింది. 2024 అక్టోబర్ లో ఉత్తర కొరియా 10,000 మంది సైనికులను రష్యాకు పంపినట్టు అమెరికా, దక్షిణ కొరియా నిఘా సంస్థలు ధృవీకరించాయి. ఈ సైనికులు కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ తో పోరాడారు. రష్యాకు ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉత్తర కొరియా సరఫరా చేస్తోంది. ఇది నిజమేనా అనే క్లారిటీ మాత్రం రాలేదు. ఇప్పుడు చైనా కూడా రష్యాకు సహాయం చేస్తోందని ఉక్రెయిన్ ఎందుకు అంటోంది? జెలెన్స్కీ ప్రకారం.. చైనా సైనికులు రష్యా తరపున యుద్ధం చేస్తున్నారని, దీని వెనక పుతిన్ యుద్ధాన్ని సాగదీయాలనే ఉద్దేశం ఉందని ఆరోపించారు. ఉక్రెయిన్ రెండు వీడియోలను విడుదల చేసింది. అందులో చైనీస్ భాష మాట్లాడే సైనికులు కనిపించారు.
చైనా గతంలో రష్యాకు ఆయుధాలు ఇవ్వడం లేదని, తటస్థంగా ఉంటున్నామని చెప్పింది. కానీ డ్యూయల్-యూస్ సాంకేతికత, మైక్రోఎలక్ట్రానిక్స్ రష్యాకు సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఇప్పుడు సైనికులు కూడా పంపిందని ఉక్రెయిన్ అంటోంది. అసలు చైనా ఈ యుద్ధంలోకి ఎందుకు దిగుతోంది? దీని వెనక రాజకీయ, ఆర్థిక లాభాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చైనా విదేశాంగ శాఖ ఈ విషయంపై తమకు సమాచారం లేదని తెలిపింది. ఉక్రెయిన్ సంక్షోభంలో చైనా ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. ఈ ఆరోపణలు తప్పుడు ప్రచారమని, దీని వెనక దురుద్దేశం ఉందని అంటోంది చైనా. ఈ ఆరోపణలు నిజమైతే.. ఉక్రెయిన్ యుద్ధం ఆసియా, యూరప్ మధ్య పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఉత్తర కొరియా ఇప్పటికే రష్యాతో ఉంది. చైనా కూడా చేరితే.. అమెరికా, నాటో దేశాలు ఎలా స్పందిస్తాయి? చైనా తటస్థత వాదనను ప్రపంచం నమ్ముతుందా? ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.