
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను చంపేస్తాం. ఉగ్ర సంస్థ అల్‌ఖైదా అరేబియన్ పెనున్సులా విభాగం చేసిన సంచలన ప్రకటన ఇది. ట్రంప్‌తో పాటు ఎలాన్ మస్క్, జేడీ వాన్స్, ఇతర టాప్ US అధికారులు వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదరించింది. అసలు ఈ బెదిరింపు ఎందుకు చేశారు..? ఈ అల్ ఖైదా శాఖ గతంలో ఎలాంటి దాడులు చేసింది? ఇప్పుడు ట్రంప్ నే ఎందుకు టార్గెట్ చేసింది? అమెరికాలో యూదులపై దాడులను ఎందుకు సమర్థిస్తోంది?
యెమెన్ కు చెందిన ఉగ్ర సంస్థ అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా విభాగం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను, శ్వేతసౌధం సిబ్బందిని చంపేస్తామని బెదిరించింది. అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా నాయకుడు సాద్‌బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ దాదాపు 30 నిమిషాల ఓ వీడియో విడుదల చేశాడు. ఇప్పటికే అతడి తలపై అమెరికా 6 మిలియన్ డాలర్ల రివార్డును ఇప్పటికే ప్రకటించింది. 2024 మార్చిలో అల్-అవ్లాకీ ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ట్రంప్ పై నిప్పులు కక్కుతున్నాడు. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని సాద్ బిన్ పిలుపునిచ్చాడు. అమెరికాలోని పలు ప్రాంతాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సె, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సహా.. వైట్ హౌస్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రతిఒక్క అధికారిని, నాయకుడిని, వారి కుటుంబాలను, బంధువులను లక్ష్యంగా చేసుకొంటామని అల్-అవ్లాకీ హెచ్చరించాడు. గాజాలో పాలస్తీనా వాసులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ దాడులు చేయాలని పిలుపునిచ్చాడు.
అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా యెమెన్ కేంద్రంగా పనిచేస్తూ .. పలు దేశాల్లో దాడులకు ప్లాన్ చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిని బెదిరిస్తూ దీని నాయకుడు అల్-అవ్లాకీ వీడియో రిలీజ్ చేశాడు. దీనితో పాటు ఈజిప్ట్, జోర్డాన్, గల్ఫ్ దేశాల నాయకులను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరించాడు. అమెరికా సపోర్ట్‌తో ఇజ్రాయెల్ పాలస్తీనియన్లపై జెనోసైడ్ కు పాల్పడుతోందని అల్-అవ్లాకీ ఆరోపిస్తున్నాడు.. అలాగే అమెరికాలో యూదులపై దాడులను సమర్థిస్తూ, వారికి ప్రపంచంలో సేఫ్ ప్లేస్ ఉండకుండా చేస్తామని బెదిరించాడు. అటు US ఇంటెలిజెన్స్ ఈ బెదిరింపును సీరియస్‌గా తీసుకుంది. అల్-అవ్లాకీపై ఆచూకీ కోసం వెతుకుతోంది.
అసలు అల్ ఖైదా ఎక్కడ మొదలైంది..? అమెరికానే ఇది ఎందుకు టార్గెట్ చేస్తోంది..?
అల్ ఖైదా 1988లో ఒసామా బిన్ లాడెన్, అబ్దుల్లా అజ్జామ్, ఐమాన్ అల్-జవాహిరీలతో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో స్థాపించబడింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో ముజాహిదీన్ యోధులకు సపోర్ట్ చేయడానికి మక్తబ్ అల్-ఖిదమత్ నెట్‌వర్క్ ద్వారా స్టార్ట్ అయిన ఈ గ్రూప్, గ్లోబల్ జిహాదీ సంస్థగా మారింది. సౌదీ బిజినెస్ టైకూన్ కొడుకు బిన్ లాడెన్, అల్ ఖైదాకు ఫైనాన్షియల్, మిలిటరీ లీడర్‌గా మారాడు. 1990లో అమెరికా సైనిక ఉనికి, ఇజ్రాయెల్ సపోర్ట్‌ను ఖండిస్తూ జిహాద్ డిక్లేర్ చేశాడు. 1996, 1998లో ఫత్వాలు జారీ చేసి, అమెరికన్ ప్రజలు, మిలిటరీని టార్గెట్ చేయాలని పిలుపునిచ్చాడు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడికి కూడా అల్ ఖైదానే కారణం. 2011లో US నేవీ సీల్స్ పాకిస్తాన్‌లో బిన్ లాడెన్‌ను హతమార్చాయి. ఆ తర్వాత అల్ ఖైదా చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన జవాహిరీ 2022లో US డ్రోన్ దాడిలో చనిపోయాడు.
అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా గతంలో సౌదీ, యెమెన్‌లో వేర్వేరుగా పనిచేసేది. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అల్‌ఖైదా అరేబియన్ పెనున్సులా అవతరించింది. సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ ఈ గ్రూపు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. సుమారు 3 వేల మంది ఉగ్రవాదులు కలిగిన ఈ ఉగ్రసంస్థ.. 2009లో US ఫ్లైట్‌ను టార్గెట్ చేసింది. కానీ ఫెయిల్ అయ్యింది. 2015లో పారిస్‌లో ఓ పత్రికా సంస్థపై దాడి చేసింది. ప్రస్తుతం అల్ ఖైదాకు 5 మెయిన్ బ్రాంచ్‌లు ఉన్నాయి. యెమెన్ లో అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా, నార్త్ ఆఫ్రికాలో అల్ ఖైదా ఇన్ ది ఇస్లామిక్ మఘ్రెబ్, సోమాలియాలో అల్ శబాబ్, సిరియాలో జబ్హత్ అల్-నుస్రా, మరొకటి అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్. యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియా, సోమాలియాలో వీటి స్థావరాలు ఉన్నాయి. అల్ ఖైదా బ్రాంచ్‌లలో మోస్ట్ యాక్టివ్, డేంజరస్‌గా అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా గుర్తింపబడింది.
అల్ ఖైదా అమెరికాపై ఎన్నో దాడులు చేసింది. 1993 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి, 1998 కెన్యా, టాంజానియా US ఎంబసీలో బాంబు పేలుడు, 2001 సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలతో దాడి అల్ ఖైదానే చేసింది. ప్రస్తుతం ట్రంప్ ను చంపేస్తామని వచ్చిన బెదిరిపుల నేపథ్యంలో అమెరికా నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. బిన్ లాడెన్, జవాహిరీ మరణాల తర్వాత అల్ ఖైదా బలహీన పడినా, అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా లాంటి శాఖలు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులు, US-ఇజ్రాయెల్ సంబంధాలు అల్ ఖైదా జిహాదీలను రెచ్చగొడుతున్నాయి. ఎప్పటికప్పుడు అమెరికా డ్రోన్ స్ట్రైక్స్ తో అల్ ఖైదా లీడర్స్ లను మట్టుపెడుతోంది. కానీ కొత్త రిక్రూట్స్, కొత్త స్లీపర్స్ సెల్స్ తో ఎప్పటికప్పుడు అల్ ఖైదా యాక్టివ్ అవుతూనే ఉంది. అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా పశ్చిమ దేశాల్లో దాడులతో అలజడి రేపు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో US హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, FBI, CIA అల ఖైదా మూమెంట్స్‌ను క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నాయి.