ఇరాన్‎పై.. అమెరికా ప్రత్యక్ష యుద్ధం..!

America Bombs Iran: నిన్నటి వరకు ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ కు పరోక్షంగా సహకరించిన అమెరికా.. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఇరాన్ లోని కీలక అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. దీనిని తమ సైనిక విజయంగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగుతోంది. అటు ఇరాన్ పై దాడుల నేపథ్యంలో అమెరికాలో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. అయితే ఇరాన్ పై దాడులకు అమెరికా ఎలా వ్యూహాన్ని ఫాలో అయ్యింది..? చాలా కాలం తర్వాత యుద్ధ రంగంలోకి దిగిన బీ2 బాంబర్లు ఎలా పనిచేశాయి..? ఈ దాడులపై రియాక్షన్స్ ఎలా ఉన్నాయి.. ? ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది..?

ఫైనల్ గా అమెరికా ఇరాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగిపోయింది. అణుఒప్పందం కుదరక పోవడంతో ఇక దాడులే కరెక్ట్ అని ట్రంప్ భావించారు. దీంతో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు, 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేశాయి. అమెరికా నావికాదళం 30 టామ్‌హాక్ మిసైళ్లను కూడా ప్రయోగించింది. ఈ దాడుల్లో ఫోర్డో అణు కేంద్రం ధ్వంసంమైంది. ఈ దాడుల్లో రేడియేషన్ లీకేజీ లేదని, పరిసర ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం తెలిపింది.

దాడుల తర్వాత వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇది అద్భుతమైన సైనిక విజయం అని ప్రకటించారు. ఇరాన్ ఇప్పుడు శాంతిని ఎంచుకోవాలి, లేకపోతే మరిన్ని దాడులు, మరింత శక్తివంతంగా ఉంటాయి అని హెచ్చరించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో, ఫోర్డోపై భారీ బాంబులు వేశాం, అన్ని విమానాలు సురక్షితంగా తిరిగొచ్చాయి అని రాశారు. ఏకంగా ఆరు బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించామన్నారు. ఇందుకోసం బీ-2 స్టెల్త్‌ బాంబర్లను వాడినట్లు వెల్లడించారు. ఇస్ఫహాన్‌, నతాంజ్‌పై తమ సబ్‌మెరైన్‌ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపారు. అయితే.. ఆరు బీ-2 స్టెల్త్ బాంబర్లు 12 బంకర్‌ బస్టర్లను ప్రయోగించినట్లు తెలిపారు.

వీటిల్లో రెండు బంకర్‌ బస్టర్లను నతాంజ్‌ అణు శుద్ధి కేంద్రంపై కూడా వాడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫోర్డోపై మొదట ఒక్కోటి 13,600కిలోల బరువుండే రెండు జీబీయూ-57 బంకర్‌ బస్టర్లు సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. కానీ, ఈ ఆపరేషన్‌లో ఏకంగా ఆరింటిని ప్రయోగించారు. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకొంటూ 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలతాయి. ఈ బాంబు బరువులో సుమారు 80 శాతం అత్యంత పటిష్ఠమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్‌ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో రెండు టన్నుల పైచిలుకు మాత్రమే విస్ఫోటకాలు ఉంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు ఖరీదు 20 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబుల తయారీకి బోయింగ్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఇలాంటి బాంబులనే అమెరికా ఇప్పుడు ఇరాన్ పై ప్రయోగించింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఈ దాడులను చరిత్రాత్మకం అని కొనియాడారు. ట్రంప్ ఈ నిర్ణయం వెనుక, ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా ఆపాలనే లక్ష్యం ఉందని చెప్పారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్నారు. తమ అణు కార్యక్రమం ఆగదు, ఈ దాడులు తమని అడ్డుకోలేవు అని ప్రకటించింది ఇరాన్ అణుశక్తి సంస్థ. అయితే అమెరికా దాడులు చేసిందని చెబుతున్న ఇరాణ్ అణుకేంద్రాల్లో నష్టం తక్కువగా ఉందని, కీలకమైన పరికరాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెబుతున్నారు. అయినప్పటికీ తమ భూభాగంపై దాడి చేసినందుకు ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇజ్రాయిల్‌పై 20 బాలిస్టిక్ మిసైళ్లతో ప్రతీకార దాడులు చేసింది ఇరాన్ గాయపడ్డారు. తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అన్ని ఆప్షన్లనూ వాడుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

జూన్ 13 నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరుపుతోంది. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాన్ దీనికి ప్రతిగా మిసైళ్లు, డ్రోన్‌లతో ఇజ్రాయిల్‌పై దాడులు చేసింది. ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటివరకూ నేరుగా పాల్గొనలేదు, ఇజ్రాయిల్‌కు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇచ్చింది. ట్రంప్ గతంలో ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని చూశారు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఈ ఒప్పందానికి అంగకరించలేదు. ఇరాన్ ఎప్పటికీ ఈ ఒప్పందం చేసుకోదని తెగేసి చెప్పారు. దీంతో అమెరికా చివరికి దాడులకు దిగింది.

అయితే ఇరాన్ లోని అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అని ట్రంప్ చెప్పినా, నష్టం తక్కువగానే ఉందని, తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించింది. రేడియేషన్ లీకేజీ లేకపోయినా, ఫోర్డోలోని యురేనియం శుద్ధి సెంట్రిఫ్యూజ్‌లకు నష్టం జరిగినట్లు IAEA, ఇరాన్ న్యూక్లియర్ సేఫ్టీ సెంటర్ అంచనా వేశాయి. నిజమైన నష్టం గురించి స్పష్టత రావాలంటే కొంత సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని సంవత్సరాల పాటు వెనక్కి నెట్టే అవకాశం ఉంది, కానీ ఇరాన్ టెర్రరిస్ట్ దాడులు, సైబర్ దాడుల ద్వారా ప్రతీకారం తీర్చుకోవచ్చని ఆందోళనలు ఉన్నాయి. America Bombs Iran.

ఈ దాడులు ప్రమాదకరమైనవి, మిడిల్ ఈస్ట్‌లో శాంతిని దెబ్బతీస్తాయి అని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. సౌదీ అరేబియా, ఓమన్ దేశాలు ఈ దాడులను ఖండిస్తూ, డిప్లొమసీ ద్వారానే పరిష్కారం కావాలని కోరాయి. యూరప్‌లోని యూకె, ఫ్రాన్స్, జర్మనీ ఇరాన్‌ను చర్చలకు రమ్మని కోరాయి. అమెరికాలో రిపబ్లికన్ నాయకులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తే, డెమొక్రాట్లు ఇది రాజ్యాంగ విరుద్ధం, కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభించారు అని విమర్శించారు. దాడులపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ షెజెష్కియాన్‌తో ఫోన్‌ లో మాట్లాడారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అటు ఈ దాడులు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/international/political-uncertainty-is-deepening-in-iran-due-israel-war-conflict/