
ఇప్పుడు శత్రుదేశంపై దాడి చేసే ఆయుధాలు తయారు చేయడం కాదు.. శత్రదేశం దాడి చేస్తే తప్పించుకునే టెక్నాలజీపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఇటీవల S400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ కు ఎలా ఉపయోగపడిందో అందరికీ తెలుసు.. తాజాగా అమెరికా అధ్యక్షుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరి.. అమెరికాకు గోల్డెన్ డోమ్ అనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేయాలని ఆదేశించారు. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది..? మిగిలిన దేశాల మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కు తేడా ఏంటి..? దీనిని అంతరిక్షంలో ఏర్పాటు చేస్తారా..? దీనిపై రష్యా, చైనా ఏం అంటున్నాయి..?
అమెరికా ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్తోన్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాను శత్రుదేశాల దాడుల నుంచి రక్షించేందుకు గోల్డెన్ డోమ్ అనే క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రణాళికను ప్రకటించారు. ఈ వ్యవస్థ మూడు సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రణాళిక కోసం మొదటి దశలో 25 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు సుమారు 175 బిలియన్ డాలర్లు అవుతుందని ఆయన అంచనా వేశారు. ఎన్నికల ప్రచారంలో అమెరికా ప్రజలకు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మిస్తానని వాగ్దానం చేశానని.. ఆ మాట నిలబెట్టుకుంటానని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ ను అంతరిక్ష ఆధారిత వ్యవస్థగా రూపొందిస్తున్నారు.
ఈ వ్యవస్థను భూమిపై ఒక నిర్దిష్ట స్థలంలో ఏర్పాటు చేయడం కాకుండా, అంతరిక్షంలో ఉపగ్రహాలు, సెన్సార్లు, ఇంటర్‌సెప్టర్లతో కూడిన నెట్‌వర్క్‌గా రూపొందిస్తారు. ఇది బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు వంటి వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చే దాడులనైనా తిప్పికొట్టే సామర్థ్యం కలిగి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
గోల్డెన్ డోమ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, ప్రపంచంలోని ఏ మూల నుంచి లేదా అంతరిక్షం నుంచి కూడా క్షిపణులు ప్రయోగించినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం అమెరికాకు ఉంటుంది. ఇది అమెరికా విజయం, భద్రతకు చాలా ముఖ్యమని ట్రంప్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గ్యూట్‌లీన్ నేతృత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. అలాగే కెనడా ఈ వ్యవస్థలో భాగం కావడానికి ఆసక్తి చూపిందని ఆయన చెప్పారు. ట్రంప్ ఈ వ్యవస్థ ఖర్చును 175 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంతరిక్షంలో ఉంచే మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థకు 20 సంవత్సరాల్లో 161 బిలియన్ నుంచి 542 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అంటే ఇది అమెరికాపై చేపట్టబోయే అతి ఖర్చుతో కూడుకున్న డిఫెన్స్ ప్రాజెక్ట్.
అయితే గోల్డెన్ డోమ్ వ్యవస్థ లక్ష్యాలు చాలా ఎక్కువగా ఉంటాయని ట్రంప్ చెబుతున్నారు. ఇవి సాధారణ ఆయుధాలైనా లేదా అణు ఆయుధాలైనా ఈ వ్యవస్థ వాటిని అడ్డుకుంటుదని అంటున్నారు. ఈ గోల్డెన్ డోమ్ పేరు ఇజ్రాయెల్‌లోని ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థ నుంచి స్ఫూర్తి పొంది పెట్టారు. ఐరన్ డోమ్ 2011 నుంచి స్వల్ప దూర క్షిపణులు, ఇతర ఆయుధాలను వేల సంఖ్యలో అడ్డుకుంది.
అమెరికా ఎదుర్కొంటున్న క్షిపణి బెదిరింపులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎదుర్కొనే షార్ట్ రేంజ్ ఆయుధాల కంటే భిన్నంగా ఉంటాయి. రష్యా, చైనా నుంచి అమెరికాకు ప్రమాదాలు పెరుగుతున్నాయని మిస్సైల్ డిఫెన్స్ రివ్యూ నివేదిక తెలియజేస్తోంది. చైనా బాలిస్టిక్, హైపర్‌సోనిక్ క్షిపణి సాంకేతికతలలో అమెరికాతో సమానంగా వస్తోంది. రష్యా తన లాంగ్ రేంజ్ క్షిపణులను ఆధునీకరిస్తోంది, అలాగే కొత్త ఖచ్చితమైన క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. అలాగే, ఉత్తర కొరియా, ఇరాన్ తదితర దేశాల నుంచి మిస్సైల్స్ ముప్పు పొంచి ఉందని అమెరికా మిస్సైల్ డిఫెన్స్ రివ్యూ నివేదిక హెచ్చరించింది. దీంతో ట్రంప్ ఈ కొత్త గోల్డెన్ డోమ్ అవసరమని భావిస్తున్నారు. అయితే రష్యా, చైనా అమెరికా గోల్డెన్ డోమ్ ప్రణాళికను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రణాళిక అంతరిక్షాన్ని యుద్ధ రంగంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. అమెరికా అంతరిక్షంలో యుద్ధం కోసం ఆయుధాలను బలోపేతం చేయడానికే ఈ ప్లాన్ వేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. చైనా కూడా అమెరికా తీరును ఖండిస్తోంది.
అమెరికాకు క్షిపణులు, డ్రోన్ల నుంచి రక్షణ పొందే టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉంది. ఉక్రెయిన్‌లో, అమెరికా తయారీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు రష్యా అధునాతన క్షిపణులను ఎదుర్కొన్నాయి. అలాగే, అమెరికా విమానాలు, యుద్ధ నౌకలు గత ఏడాది ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించాయి. అలాగే, యెమెన్‌లోని ఇరాన్ మద్దతు పనిచేస్తున్న హుతీ తిరుగుబాటుదారులు.. అమెరికా నౌకలపై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంది. అయితే గోల్డెన్ డ్రోమ అంతకుమించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నారు. ఇది ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్ లా అనిపించినా దాని కంటే అడ్వాన్స్ డ్ అంటున్నారు.
ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ గగనతల రక్షణ వ్యవస్థ స్వల్ప దూర క్షిపణులు, రాకెట్లు, ఆర్టిలరీ షెల్స్ వంటి వాటిని అడ్డుకోవడానికి రూపొందించబడింది. 2011 నుంచి ఈ వ్యవస్థ ఇజ్రాయెల్ కు అందుబాటులోకి వచ్చింది. గాజా స్ట్రిప్ నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఈ వ్యవస్థలో రాడార్ కీలక భాగం. ఇది శత్రువు ప్రయోగించిన రాకెట్ లేదా క్షిపణి దిశ, వేగం, లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని బ్యాటిల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విశ్లేషిస్తుంది. రాకెట్ జనావాస ప్రాంతంపై పడే ప్రమాదం ఉందా అని నిర్ణయిస్తుంది. ప్రమాదం లేని రాకెట్లను వదిలేస్తుంది. ఖర్చును ఆదా చేస్తుంది. ప్రమాదం ఉంటే, టామిర్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇవి గాలిలో శత్రు రాకెట్‌ను ఢీకొట్టి నాశనం చేస్తాయి. ఈ వ్యవస్థ 4 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఎదుర్కొంటుంది, 90% సక్సెస్ రేటుతో పనిచేస్తుంది. అయితే అమెరికా గోల్డెన్ డోమ్ ఐరన్ డోమ్‌కు భిన్నంగా ఉంటుంది. ఐరన్ డోమ్ స్వల్ప దూర రాకెట్లపై దృష్టి సారిస్తే, గోల్డెన్ డోమ్ అమెరికా అభివృద్ధి చేస్తున్న విస్తృత రక్షణ వ్యవస్థ. ఇది బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి రూపొందించబడింది, ఇవి సాధారణ లేదా అణు ఆయుధాలు కావచ్చు దేనినైనా అడ్డుకుంటుంది. గోల్డెన్ డోమ్ భూమి, సముద్రం, అంతరిక్షంలో సెన్సార్లు, ఇంటర్‌సెప్టర్లను ఉపయోగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లేదా అంతరిక్షం నుంచి ప్రయోగించిన క్షిపణులను కూడా ఎదుర్కొంటుంది. ఐరన్ డోమ్ షార్ట్ రేంజ్ కోసం పనిచేస్తే, గోల్డెన్ డోమ్ లాంగ్ రేంజ్ లక్ష్యంగా పనిచేస్తుంది.
భారతదేశం విషయానికి వస్తే.. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది రెండు దశలలో పనిచేస్తుంది. మొదటి దశలో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అనే ఎక్కువ ఎత్తులో పనిచేసే ఇంటర్‌సెప్టర్, రెండవ దశలో అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ అనే తక్కువ ఎత్తులో పనిచేసే ఇంటర్‌సెప్టర్ ఉన్నాయి. ఈ వ్యవస్థ 2000-5000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలదు. అయితే, ఇది గోల్డెన్ డోమ్ లాంటి అంతరిక్ష ఆధారిత సామర్థ్యం, హైపర్‌సోనిక్ క్షిపణులను ఎదుర్కొనే సాంకేతికతను కలిగి లేదు. భారత్ ఎస్-400 వంటి రష్యన్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఇవి క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొంటాయి, కానీ గోల్డెన్ డోమ్ విస్తృత సామర్థ్యంతో పోల్చితే భారత్ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలో ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశగా ప్రయోగాలు చేసే ఆలోచనలో ఉంది.