ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్.. అత్యంత శక్తివంతమైన క్షిపణి ప్రయోగం.. చైనా, రష్యా, షాక్

ఓ పక్క రష్యా, ఉక్రెయిన్.. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్, ఇప్పుడు భారత్, పాకిస్థాన్ .. దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అన్ని దేశాల మధ్యలో వేలు పెట్టే పెద్దన అమెరికాకు.. హఠాత్తుగా క్షిపణి పరీక్షలు గుర్తుకు వచ్చాయి. తన మాట ఎవరు వినడం లేదనో.. లేక మా దగ్గర భయపెట్టే క్షిపణులు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడానికో తెలియదు కాని.. అమెరికాకు ఎంతో నమ్మకమైన మినిట్‌మ్యాన్-3 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఓ పక్కన గోల్డెన్ డోమ్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు అమ్మబాబు లాంటి వ్యవస్థ తీసుకొస్తున్నామని ట్రంప్ ప్రకటించిన తర్వాతి రోజే.. మినిట్‌మ్యాన్-3 ప్రయోగాన్ని ఎలా చూడొచ్చు..? అలసు ఏంటీ మినిట్‌మ్యాన్-3..? దీనికి అంత సత్తా ఉందా..? ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని నాశనం చేయాలన్నా ఈ క్షిపణి చేయగలదా..?

అమెరికా న్యూక్లియర్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రష్యాకు పోటీగా కోల్డ్ వార్ సమయం నుంచి వేల సంఖ్యలో అమెరికా అణుఆయుధాలు తయారు చేసింది. వాటిని ప్రయోగించాలంటే దానికి తగ్గ క్షిపణి కూడా కావాలి. అలాంటిదే అమెరికా ఎంతో నమ్మే మినిట్‌మ్యాన్-3 క్షిపణి. అణ్వాయుధాలను ఇది సులభంగా మోసుకుని వెళ్లగలదు. అలాంటి అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్‌మ్యాన్‌-3ను అమెరికా పరీక్షించింది. ఓ పక్క ట్రంప్‌ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ గోల్డెన్‌డోమ్‌ నిర్మిస్తున్నట్లు ప్రకటించిన వేళ ఈ ప్రయోగం జరగడం అమెరికా శత్రుదేశాల్లో కలవరం కలగిస్తోంది.. కాలిఫోర్నియాలోని వాన్డెన్‌బెర్గ్‌ స్పేస్‌ బేస్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ అణువార్ హెడ్ లేకుండా క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో.. 4,200 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి మార్షల్‌ ఐల్యాండ్స్‌లోని అమెరికా స్పేస్‌ అండ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ కమాండ్‌కు చెందిన బాలిస్టిక్‌ డిఫెన్స్‌ టెస్ట్‌ ప్రదేశానికి చేరింది. మినిట్‌మ్యాన్‌-3లో అత్యంత శక్తిమంతమైన మార్క్‌-23 రీఎంట్రీ వెహికల్‌ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్‌ పేలోడ్‌ను అమర్చవచ్చు. మార్క్ 23 అంటే.. ధ్వని వేగానికి 23 రేట్లు స్పీడ్ తో ప్రయాణిస్తుంది. అంటే గంటకు సుమారు 24 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రపంచంలోని ఏ టార్గెట్ ను అయినా 30 నిమిషాల్లో చేరుకుని నాశనం చేస్తుంది. గతంలో సాలాసార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. గతేడాది నవంబర్‌లో ట్రంప్‌ విజయానికి ముందు కూడా ఒకసారి పరీక్షించారు. వాస్తవానికి మినిట్‌మ్యాన్‌ క్షిపణి 1970ల నాటిది. దీనిని సెంటెనిల్‌ సిస్టమ్‌తో భర్తీ చేయాలని అమెరికా భావిస్తోంది. కానీ, మినిట్‌మ్యాన్‌-3 మాత్రం అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తారు.

అసలు ఏంటి మినిట్‌మ్యాన్-3..? మినిట్‌మ్యాన్-3 అనేది అమెరికా యొక్క ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది 1970ల దీనిని మొదట పరీక్షించారు. గరిష్టంగా 13,000 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని చేరుకోగలదు. ఇది ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. 335 కిలోటన్ శక్తి కలిగిన అణు ఆయుధాన్ని తీసుకువెళ్లగలదు. దీని గైడెన్స్ సిస్టమ్ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా గుర్తించగలదు. దాదాపు 200 మీటర్ల లోపంలో లక్ష్యాన్ని తాకగలదు. మినిట్‌మ్యాన్-3 ఒక ఘన ఇంధన రాకెట్. మూడు దశల ద్వారా పనిచేస్తుంది. మొదటి దశలో రాకెట్‌ను భూమి నుంచి గగనతలంలోకి అత్యంత వేగంగా వెళ్తుంది. రెండవ దశలో భూవాతావరణం దాటి అంతరిక్షంలోకి చేరుకోవడానికి సహాయపడుతుంది. మూడవ దశలో లక్ష్యం వైపు రీ-ఎంట్రీ వెహికల్స్‌ను ఖచ్చితంగా మోసుకెళ్తుంది. ఈ దశలో ఒకటి కంటే ఎక్కువ అణు ఆయుధాలను వేర్వేరు లక్ష్యాలకు పంపే సాంకేతికత దీనికి ఉంది. ఇది ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్, GPS సహాయంతో టార్గెన్ ను ఖచ్చితంగా గుర్తిస్తుంది. పరీక్షల సమయంలో, అణ్వాయుధ లేకుండా రీ-ఎంట్రీ వెహికల్‌ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కూడా అమెరికా అణ్వాయుధం లేకుండా మినిట్ మ్యాన్ 3 ని ప్రయోగించింది.

అమెరికా దగ్గర వివిధ రకాల క్షిపణులు ఉన్నాయి. వీటిని మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. వీటిలో మొదటివి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు. వీటిని షార్ట్ కట్ లో ICBMs అంటారు. మినిట్‌మ్యాన్-3 ప్రస్తుతం అమెరికాకు ఏకైక భూ-ఆధారిత ICBM. అమెరికా ఇలాంటి 400 క్షిపణులను ఐదు రాష్ట్రాలలో మోహరించిందని చెబుతారు. ఇక అమెరిక దగ్గర సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ -SLBMs కూడా ఉన్నాయి. వీటిలో ట్రైడెంట్ 2 క్షిపణులు ఓహియో-క్లాస్ సబ్‌మెరైన్‌ల నుంచి ప్రయోగించవచ్చు. ఇవి అణు ఆయుధాలను మోసుకెళ్లగలవు. అలాగే క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. టామ్‌హాక్ క్రూయిజ్ క్షిపణులు నౌకలు, విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఇవి సాంప్రదాయ లేదా అణు ఆయుధాలను మోసుకెళ్లగలవు. ఎయిర్-లాంచ్డ్ క్షిపణులు.. AGM-86 ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ వంటివి B-52 బాంబర్‌ల నుంచి ప్రయోగిస్తారు. అమెరికా న్యూక్లియర్ ట్రైడ్.. అంటే భూ-ఆధారిత, సముద్ర-ఆధారిత, గగన-ఆధారిత క్షిపణులను కలిగి ఉంది. అంటే అన్ని రకాలుగా దాడులు చేయవచ్చు..

మినిట్‌మ్యాన్-3 అణు ఆయుధాలను తీసుకువెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ఒక్కోటి 335 కిలోటన్ శక్తి ఉండే మూడు వరకు W87 అణు ఆయుధాలను మోసుకెళ్లగలదు. అయితే స్టార్ట్ ఒప్పందం ప్రకారం, అమెరికా చాలా మినిట్‌మ్యాన్-3 క్షిపణులను ఒకే అణు ఆయుధంతో మోహరిస్తోంది. మినిట్‌మ్యాన్-3 క్షిపణి పరీక్షకు ఒక రోజు ముందే ట్రంప్ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రకటించారు. ఈ వ్యవస్థ బాలిస్టిక్, అధునాతన క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షణ కల్పించడానికి రూపొందించబడింది. మినిట్‌మ్యాన్-3 పరీక్ష ఈ ప్రణాళిక ప్రకటన తర్వాత జరగడం ఒక స్ట్రాటజిక్ మెసేజ్ గా భావించవచ్చు. అమెరికా అణు శక్తి, రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి, ముఖ్యంగా రష్యా, చైనా వంటి పోటీ దేశాలకు చూపించడానికి ఈ పరీక్ష జరిగిందని అంటున్నారు. గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ భవిష్యత్తులో మినిట్‌మ్యాన్-3 వంటి క్షిపణులతో సమన్వయంగా పనిచేయవచ్చు, దీని ద్వారా శత్రు దాడులను తిప్పికొట్టడం, ప్రతిదాడులను నిర్వహించడం సాధ్యమవుతుంది. అటు అమెరికా అమెరికా అణు క్షిపణి పరీక్షలను ఎప్పుడూ రష్యా, చైనా జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటాయి. రష్యాతో ఉన్న ఉద్రిక్తతలు, చైనాతో ఆయుధ పోటీ నేపథ్యంలో, ఈ పరీక్ష వారి రక్షణ వ్యూహాలపై చర్చకు దారి తీసింది. అయితే రొటీన్‌ పరీక్షల్లో భాగంగా మినిట్ మ్యాన్ 3 ని ప్రయోగించామని అమెరికా తెలిపింది.