
ప్రపంచంలోనే ప్రశాంతమైన, సురక్షితమైన దేశాల జాబితాలో టాప్ 10లో ఉన్న ఆస్ట్రియాలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆ దేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అక్కడి వారిని ఉలిక్కిపడేలా చేసింది. ఆస్ట్రియాలోని ఓ స్కూల్‌ల్లో విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనంలో పది మంది ప్రాణాలు పోయారు. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆస్ట్రియా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఎంతో ప్రశాంతం ఉండే దేశంలో ఇలాంటి ఘటన ఎందుకు జరిగింది..? స్కూల్ కాల్పులు ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగడానికి కారణం ఏంటి? విద్యార్థులు ఇలాంటి హింసాత్మక చర్యలకు ఎందుకు దిగుతున్నారు?
ఆస్ట్రియాలోని రెండో పెద్ద నగరం గ్రాజ్‌లోని ఒక సెకండరీ స్కూల్‌లో కాల్పుల ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక విద్యార్థి తుపాకీతో జరిపిన కాల్పుల్లో.. 10 మంది చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఈ దాడి చేసిన విద్యార్థి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు స్కూల్‌లో భారీ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వాళ్లలో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు.
ఆస్ట్రియా లాంటి దేశంలో ఇలాంటి దాడులు చాలా అరుదు. ఎందుకంటే ఈ దేశం 92 లక్షల జనాభాతో గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే టాప్ 10 సురక్షిత దేశాల్లో ఒకటి. ఇలాంటి దాడులను గతంలో ఆస్ట్రియా ఎప్పుడూ చూడలేదు. దీంతో అసలు ఈ ఘటనకు కారణం ఏంటి..? విద్యార్థి ఎందుకు అలా ప్రవర్తిండానో దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. కానీ, పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో పాఠశాలల్లో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అలాగే ఇతర దేశాల్లోను పాఠశాలల్లో కాల్పులు ఘటన కలకలం రేపాయి. 2025 జనవరిలో స్లోవాకియాలో 18 ఏళ్ల వ్యక్తి ఒక హైస్కూల్ విద్యార్థిని, టీచర్‌ను కత్తితో చంపాడు. 2024 డిసెంబర్‌లో క్రొయేషియాలో 19 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల విద్యార్థిని కత్తితో చంపి, ఇతరులను గాయపరిచాడు. 2023 డిసెంబర్‌లో ప్రాగ్‌లోని ఒక యూనివర్సిటీలో జరిగిన దాడిలో 14 మంది చనిపోయారు, 25 మంది గాయపడ్డారు. అదే ఏడాది బెల్‌గ్రేడ్‌లో 13 ఏళ్ల బాలుడు తన సహవిద్యార్థులు ఎనిమిది మందిని, ఒక సెక్యూరిటీ గార్డ్‌ను చంపేశాడు. 2009లో జర్మనీలోని విన్నెండెన్‌లో మాజీ విద్యార్థి 15 మందిని చంపి, తనను తాను కాల్చుకున్నాడు. అమెరికాలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువ. 1999లో కొలంబైన్ హైస్కూల్ షూటింగ్‌లో 13 మంది చనిపోయారు. 2012లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్‌లో 26 మంది, 2018లో పార్క్‌లాండ్‌లో 17 మంది మరణించారు.
అమెరికాలో స్కూల్ షూటింగ్‌లు ఎక్కువగా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, తుపాకీలకు సులభంగా అందుబాటు. అమెరికాలో తుపాకీలు కొనడం, కలిగి ఉండడం చట్టబద్ధం, దీని వల్ల యువకులు, విద్యార్థులు కూడా సులభంగా ఆయుధాలు సమకూర్చుకుంటారు. రెండోది, మానసిక ఆరోగ్య సమస్యలు. చాలా మంది దాడి చేసిన వాళ్లు డిప్రెషన్, ఒంటరితనం, బెదిరింపులు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అమెరికా స్కూల్లో బుల్లీయింగ్ చాలా సాధారణం, ఇది కొందరిలో కోపాన్ని, ప్రతీకార భావనను రేకెత్తిస్తుంది. మూడోది, సోషల్ మీడియా, వీడియో గేమ్స్, సినిమాల్లో హింసను చూపించడం ఎక్కువ కావడం. ఇవి కొందరు యువకులపై ప్రభావం చూపి, హింసను ఒక పరిష్కారంగా చూసేలా చేస్తుంది. దీనికి తోడు చాలా మంది దాడి చేసిన వాళ్లు తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా, ఒంటరిగా పెరిగిన వారే. అమెరికాలో తుపాకీ సంస్కృతి, గన్ కంట్రోల్ చట్టాలపై చర్చ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది, కానీ ఇప్పటివరకు ఈ సమస్యకు గట్టి పరిష్కారం దొరకలేదు.
విద్యార్థులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటానికి పైన చెప్పిన మానసిక ఆరోగ్య సమస్యలు, బుల్లీయింగ్, సామాజిక ఒత్తిడులు ప్రధాన కారణాలు. చాలా మంది యువకులు తమ సమస్యలను చెప్పుకునే వాతావరణం లేకపోవడం, సరైన కౌన్సెలింగ్ లేకపోవడం వల్ల ఈ దారికి దిగుతారు. స్కూల్లో సమస్యలు, ఇంట్లో అనుబంధం లేకపోవడం వాళ్లను ఒంటరిగా, నిస్సహాయంగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అమెరికా లాంటి దేశాల్లో ఈ సమస్యను తగ్గించడానికి గన్ కంట్రోల్ చట్టాలను కఠినం చేయాలని కొందరు, మానసిక ఆరోగ్య సేవలను మెరుగు చేయాలని మరికొందరు అంటారు. స్కూళ్లలో సెక్యూరిటీ పెంచడం, విద్యార్థులకు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, బుల్లీయింగ్‌ను నియంత్రించడానికి కఠిన రూల్స్ పెట్టడం కూడా కొంతవరకు సహాయపడతాయి. ఆస్ట్రియా లాంటి సురక్షిత దేశంలో ఇలాంటి ఘటన జరగడం ప్రపంచవ్యాప్తంగా స్కూల్ సేఫ్టీపై చర్చను మళ్లీ రేకెత్తించింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వాలు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత్ లో గన్స్ అంత విరిగివిగా లభించవు కాబట్టి.. కాల్పుల ఘటనలు చాలా అరుదు. అయితే విద్యార్థుల్లో విపరీత ధోరణులను అరికట్టాల్సిన అవసరం ఉంది.