జనాభా పెరుగుదల కోసం చైనా కష్టాలు..?!

China population: ఒకప్పుడు జనాభాను కట్టడి చేసేందుకు కఠినమైన పాలసీలను అమలు చేసిన చైనా, ఇప్పుడు జనాభాను పెంచేందుకు భారీ ఆఫర్లు ఇస్తోంది. మూడో బిడ్డను కంటే ఏకంగా 12 లక్షల రూపాయల ప్రోత్సాహకం అందిస్తామని ప్రకటించింది. అసలు చైనా ఇలాంటి ఆఫర్లు ఎందుకు ఇస్తోంది..? ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.? ఈ సమస్యను అధిగమించేందుకు చైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక కారణాలు ఏమిటి?

ఒకప్పుడు ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అన్న చైనా .. ఇప్పుడు ముగ్గుర పిల్లలని కనకపోతే ఊరుకోం అంటోంది. ఇలాంటి పరిస్థితి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. చైనా ఒకప్పుడు జనాభా పెరుగుదలను అరికట్టేందుకు 1979 నుంచి 2015 వరకు వన్-చైల్డ్ పాలసీని అమలు చేసింది. ఈ విధానం వల్ల జనాభా నియంత్రణలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఊహించని సమస్యలు తలెత్తాయి. 2022 నుంచి చైనా జనాభా తగ్గుముఖం పట్టింది, 2024లో జనన రేటు రికార్డు స్థాయిలో 6.39కి పడిపోయింది. 2016తో పోలిస్తే జననాలు సగానికి తగ్గాయి. యుఎన్ అంచనాల ప్రకారం, 2050 నాటికి చైనా జనాభా 800 మిలియన్లకు, 2100 నాటికి 700 మిలియన్లకు పడిపోవచ్చు. ఈ పరిస్థితి చైనా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న దేశానికి, భారీ ఆందోళన కలిగిస్తోంది. దీంతో, 2015లో వన్-చైల్డ్ పాలసీని రద్దు చేసిన చైనా, ఇప్పుడు జననాలను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలను తీసుకొస్తోంది. 2025 నుంచి ప్రతి నవజాత శిశువుకు సంవత్సరానికి సుమారు 42,000 రూపాయలు మూడేళ్ల వయసు వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చైనాలోని కొన్ని నగరాలు జనన రేటును పెంచేందుకు భారీ సబ్సిడీలను ప్రకటించాయి. ఇన్నర్ మంగోలియా రాజధాని హోహ్హోట్‌లో రెండో బిడ్డకు 6 లక్షల రూపాయలు, మూడో బిడ్డకు 12 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ఈ సబ్సిడీలు ఒకేసారి కాకుండా, కొన్ని సంవత్సరాల వ్యవధిలో అందిస్తారు. తూర్పు చైనాలోని హెఫీ నగరం రెండో బిడ్డకు 24,000 రూపాయలు, మూడో బిడ్డకు 60,000 రూపాయలు ఇస్తోంది. ఈ స్థానిక సబ్సిడీలు జాతీయ స్థాయిలో అమలు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. టియాన్మెన్, హోహ్హోట్ వంటి నగరాల్లో ఈ సబ్సిడీలు కొంత సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని స్థానిక నివేదికలు చెబుతున్నాయి. ఒక సర్వేలో లక్ష మంది తల్లిదండ్రులను అడిగితే, కేవలం 15% మంది మాత్రమే మరో బిడ్డను కనాలనుకుంటున్నారని, అయితే ఆర్థిక సహాయం ఆఫర్ చేస్తే ఈ శాతం 8.5% పెరిగిందని తేలింది. ఈ ఆఫర్‌లు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయని, కానీ జనన రేటును పూర్తిగా పెంచడానికి ఇవి సరిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. China population.

జనాభా తగ్గుదలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం పలు రకాల విధానాలను అమలు చేస్తోంది. 2025 నుంచి జాతీయ స్థాయిలో ప్రతి బిడ్డకు 3,600 యువాన్ వార్షిక సబ్సిడీ ఇవ్వడంతో పాటు, స్థానిక ప్రభుత్వాలు రెండో, మూడో బిడ్డలకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. చైల్డ్‌కేర్ సౌకర్యాలను విస్తరించడం, గృహ సబ్సిడీలు అందించడం, ఉద్యోగ స్థలాల్లో ఓవర్‌టైమ్‌ను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది. పలు పెద్ద కంపెనీలు ఓవర్‌టైమ్ తగ్గించేందుకు అంగీకరించాయి, దీనివల్ల తల్లిదండ్రులకు కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా లభిస్తుంది. అలాగే, వివాహ రేటు గత 50 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి పడిపోవడం వల్ల, వివాహాలను ప్రోత్సహించేందుకు కూడా కొన్ని నగరాలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఈ చర్యలు జనన రేటును కొంత మెరుగుపరిచినప్పటికీ, యువతలో ఆర్థిక సమస్యలు, ఇంటి ఖర్చులు, ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలు జననాల సంఖ్యను పెంచడంలో అడ్డంకిగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

అయితే చైనాలో జనాభా తగ్గడం ఆ దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జనన రేటు తగ్గడం వల్ల వర్క్‌ఫోర్స్ క్షీణిస్తోంది, ఇది ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తోంది. 2024లో చైనా వర్క్‌ఫోర్స్ 1960ల తర్వాత అతి తక్కువ స్థాయికి చేరింది. అటు 65 ఏళ్లు పైబడిన వృద్ధ జనాభా వేగంగా పెరుగుతోంది. దీనివల్ల పెన్షన్, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. 2050 నాటికి చైనాలో 400 మిలియన్ల మంది వృద్ధులు ఉంటారని అంచనా. ఇక తక్కువ జనన రేటు వల్ల భవిష్యత్‌లో వినియోగదారుల సంఖ్య తగ్గి.. దీనివల్ల ఆర్థిక డిమాండ్ క్షీణించే అవకాశం ఉంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో బలహీనపరుస్తుంది. అలాగే వన్-చైల్డ్ పాలసీ వల్ల పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండటం వివాహ రేటును తగ్గించింది, ఇది జనన రేటుపై మరింత ప్రభావం చూపుతోంది.

చైనా జనన రేటును పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వీటి విజయం అనేక అంశాలపై ఆధారపడి ఉంది. సబ్సిడీలు ఆర్థిక భారాన్ని తగ్గించినప్పటికీ, యువతలో జీవన శైలి మార్పులు జననాలను ప్రభావితం చేస్తున్నాయి. సబ్సిడీలు ఉపయోగపడతాయి, కానీ బిడ్డను పెంచడానికి ఆర్థిక స్థిరత్వం, సమయం కూడా ముఖ్యం అని అంటున్నారు కొంతమంది చైనా యువకులు. నార్డిక్ దేశాల్లో సుదీర్ఘ పేరెంటల్ లీవ్, సబ్సిడీలు ఉన్నప్పటికీ జనన రేటు తగ్గడం చైనాకు సమస్యగా ఉంది. సబ్సిడీలతో పాటు, సామాజిక సంస్కరణలు, మహిళలకు ఉద్యోగ భద్రత, చైల్డ్‌కేర్ సౌకర్యాలు, విద్యా ఖర్చుల తగ్గింపు వంటి చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చైనా ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సమగ్ర విధానం అవలంబించకపోతే, జనాభా సంక్షోభం ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. చైనా ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తుందనేది ప్రపంచ ఆర్థిక వేదికపై దాని స్థానాన్ని నిర్ణయిస్తుంది.

Also Read: https://www.mega9tv.com/international/japan-about-to-experience-a-major-disaster-seismic-activity-has-intensified-since-june-21-warning-of-a-major-earthquake/