
Dalai lama’s Successor: టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా తన 90వ జన్మదిన వేడుకల సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు. తన వారసుడి ఎంపిక ప్రక్రియను టిబెటన్ సంప్రదాయాల ప్రకారం, తన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చైనాకు ఇప్పుడు మింగుడుపడటం లేదు..? దలైలామా వారసుడి అంశం ఎందుకు ఇంత వివాదాస్పదమైంది? చైనా, భారత్, అమెరికా ఈ విషయంపై ఎలా స్పందిస్తున్నాయి? దలైలామా వారసుడి ఎంపిక సంప్రదాయం వెనుక చరిత్ర ఏమిటి?
దలైలామా తన 90వ జన్మదినం సందర్భంగా భారత్‌లోని ధర్మశాలలో జరిగిన మూడు రోజుల మత సమావేశంలో ఒక కీలక ప్రకటన చేశారు. తన వారసుడి ఎంపిక గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ ద్వారా, టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం జరుగుతుందని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చైనాకు సవాల్‌గా మారింది, ఎందుకంటే చైనా దలైలామా వారసుడిని తామే ఎంపిక చేస్తామని, దీనికి క్వింగ్ రాజవంశం నాటి గోల్డెన్ ఉర్న్ పద్ధతిని ఉపయోగిస్తామని చెబుతోంది. దలైలామా చైనా ప్రకటనకు వ్యతిరేకంగా.. తన వారసుడు చైనా పాలనలో లేని స్వతంత్ర దేశంలో జన్మిస్తాడని, టిబెటన్ బౌద్ధుల సాంప్రదాయిక పద్ధతులను అనుసరించి ఎంపిక జరుగుతుందని నొక్కి చెప్పారు. ఈ ప్రకటన టిబెటన్ సమాజంలో ఆనందం కలిగించినప్పటికీ, చైనాతో ఉద్రిక్తతలను మరింత పెంచింది.
చైనా దలైలామా ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్, దలైలామా వారసుడి ఎంపిక చైనా చట్టాలు, మతపరమైన ఆచారాలు, చారిత్రక సంప్రదాయాల ప్రకారం జరగాలని, దీనికి చైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. టిబెట్‌ను చైనా నుంచి వేరు చేయాలనే ఉద్దేశంతో దలైలామా పనిచేస్తున్నారని ఆరోపిస్తోంది డ్రాగెన్ దేశం. 1995లో పంచెన్ లామా ఎంపిక విషయంలో కూడా చైనా జోక్యం చేసుకొని, దలైలామా ఎంపిక చేసిన ఆరేళ్ల బాలుడిని అపహరించి, తమ సొంత అభ్యర్థిని నియమించింది. ఇప్పుడు కూడా చైనా తన ప్రభావాన్ని కొనసాగించేందుకు దలైలామా వారసుడి ఎంపికలో కూడా జోక్యం చేసుకోవాలని భావిస్తోంది. అటు భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, టిబెట్ సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భారత్-చైనా సంబంధాలు దెబ్బతింటాయని చైనా హెచ్చరించింది.
ఇటు భారత్ దలైలామా వారసుడి ఎంపిక విషయంలో ఆయనకు, ఆయన స్థాపించిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది. దలైలామా వారసుడిని ఎంపిక చేసే హక్కు ఆయనకు, టిబెటన్ బౌద్ధ సంప్రదాయాలకు మాత్రమే ఉందని… ఇందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చైనాకు గట్టి వార్నింగ్ గా మారాయి. భారత్ 1959 నుంచి దలైలామాకు ఆశ్రయం కల్పిస్తోంది, ధర్మశాలలో టిబెటన్ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో, దలైలామా వారసుడి ఎంపిక భారత్‌కు కూడా ఒక రాజకీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అంశంగా మారింది. దలైలామా 90వ జన్మదిన వేడుకలకు కిరెన్ రిజిజు, ఇతర కేంద్ర మంత్రులు హాజరవడం భారత్ మద్దతును స్పష్టం చేస్తోంది. ఈ విషయం భారత్-చైనా సంబంధాలపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు.
అమెరికా దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తోంది. 2020లో అమెరికా ఆమోదించిన టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్, దలైలామా వారసుడి ఎంపికలో జోక్యం చేసుకునే చైనా అధికారులపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే దలైలామా జన్మదినం సందర్భంగా అమెరికా ప్రత్యేక సందేశంతో శుభాకాంక్షలు తెలిపింది. ఒకవైపు టిబెటిన్లకు మద్దతు పలుకుతున్నట్లు, మరోవైపు చైనాను హెచ్చరిస్తున్నట్లు అమెరికా సందేశం ఉండటం విశేషం. 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిబెటన్లు తమ మత పెద్దలను స్వేచ్ఛగా, ఇతరుల జోక్యం లేకుండా ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ప్రపంచానికి దలైలామా ఐక్యత, శాంతి, కరుణల సందేశాన్ని అందిస్తూ, ప్రజల్లో శాంతి నెలకొల్పుతున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. చైనా పేరు ఎత్తకుండానే రూబియో.. టిబెటన్ల సాంస్కృతిక, మత స్వేచ్ఛకు అమెరికా మద్దతు ఇస్తుందనే సందేశాన్ని తెలియజేశారు. టిబెటన్ల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కట్టుబడి ఉందన్నారు. టిబెటన్ల ప్రత్యేక భాష, సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని, ఇతరుల జోక్యం లేకుండా వారు మత పెద్దలను స్వేచ్ఛగా ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుతామని అన్నారు మార్కో రూబియో.
దలైలామా ఎంపిక సంప్రదాయం టిబెటన్ బౌద్ధమతంలో ఒక పవిత్రమైన ప్రక్రియ. దలైలామా అవలోకితేశ్వర బోధిసత్వ రూపంగా పరిగణించబడతారు. ఆయన మరణం తర్వాత ఆయన ఆత్మ పునర్జన్మం పొందుతుందని నమ్ముతారు. సాంప్రదాయకంగా, దలైలామా మరణం తర్వాత ఆయన వారసుడిని కనుగొనేందుకు ఒక శోధన సమితి ఏర్పాటు చేయబడుతుంది. ఈ సమితి మతపరమైన దర్శనాలు, దలైలామా వదిలివెళ్లిన సూచనలు, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా శోధన నిర్వహిస్తుంది. లామో లాట్సో అనే పవిత్ర సరస్సులో దర్శనాలు, మరణ సమయంలో దలైలామా శరీరం ఏ దిశలో ఉంది, ఆయన శవం దహన సమయంలో పొగ ఏ దిశలో వెళ్లింది వంటి సంకేతాలను పరిగణిస్తారు. ఈ ప్రక్రియలో ఎంపికైన బాలుడు బౌద్ధ శాస్త్రాలలో శిక్షణ పొంది, ఆధ్యాత్మిక నాయకత్వం కోసం సిద్ధం చేయబడతాడు. ఈ సంప్రదాయం 14వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది, కానీ 1793లో క్వింగ్ రాజవంశం సమయంలో చైనా గోల్డెన్ ఉర్న్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనిని టిబెటన్లు చాలామంది వ్యతిరేకిస్తారు. దలైలామా ఈ సంప్రదాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ, తన వారసుడి ఎంపిక స్వతంత్రంగా, టిబెటన్ సంప్రదాయాల ప్రకారం జరగాలని నొక్కి చెప్పారు.
దలైలామా వారసుడి అంశం భారత్ అంతర్జాతీయ ఖ్యాతిని మరింత పెంచింది. భారత్ 1959 నుంచి దలైలామాకు ఆశ్రయం కల్పించడం, టిబెటన్ ప్రభుత్వాన్ని ధర్మశాలలో కొనసాగించేందుకు అనుమతించడం ద్వారా మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న దేశంగా ప్రపంచ వేదికపై నిలిచింది. దలైలామా వారసుడి ఎంపికలో భారత్ స్పష్టమైన మద్దతు, ఆసియాలోని బౌద్ధ దేశాలైన మంగోలియా, శ్రీలంక, థాయిలాండ్, జపాన్, భూటాన్ వంటి దేశాల్లో భారత్ ఆధ్యాత్మిక, నైతిక నాయకత్వాన్ని బలపరిచింది. ఈ విషయంలో చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, భారత్ తన సాఫ్ట్ పవర్‌ను ప్రదర్శించింది. భారత్ ఈ వైఖరి టిబెటన్ సమాజానికి ఒక బలమైన మద్దతుగా నిలిచిందని పేర్కొన్నాయి.