ఇజ్రాయెల్ హద్దు దాటిందా..? నెతన్యాహు యూకే సీరియస్. దూరమవుతోన్న మిత్రులు..!!

ఇజ్రాయెల్ కు ఇప్పుడు మిత్రులే శత్రువులు అవుతున్నారా..? గాజా విషయంలో ఇజ్రాయెల్ తీరును ఎందుకు తప్పుపడుతున్నారు..? హమాస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని చెబుతోన్న నెతన్యాహు.. సాధారణ పౌరుల విషయం మర్చిపోయారా..? ఓ పక్క గాజా స్ట్రిప్ లో ఆకలికేకలు.. ఇజ్రాయెల్ కు వినిపించడం లేదా..? శత్రువులను చంపొచ్చు.. కాని చిన్నపిల్లలు ఏం చేశారని ప్రశ్నలకు నెతన్యాహు సమాధానం ఏం చెబుతున్నారు..?

ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో గాజాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా నిమిషానికో దాడి జరుగుతుండటంతో.. భవనాల శిథిలాలు, శవాల కుప్పలు, ఆకలి కేకలతో గాజా మొత్తం భయానకంగా మారిపోయింది. దీంతో అక్కడి ప్రజల జీవనం పూర్తి ప్రశ్నార్థకంగా మారగా.. ఇజ్రాయెల్ పరిమిత స్థాయిలోనే మానవతా సాయానికి అనుమతి ఇస్తోంది. సాయం అందకపోతే అక్కడ చిన్నపిల్లలు మరణిస్తారని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆ దేశంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇజ్రాయెల్ సైనిక దాడులు, దిగ్బంధం వల్ల గాజాలో ఆహారం, నీరు, ఔషధాలు, ఇంధనం వంటి అత్యవసర సామగ్రి కొరత తీవ్రమైంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటివరకు 52,800 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారని చెబుతున్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు ధ్వంసమై, లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఉత్తర గాజాలోని ఇండోనేషియన్ ఆసుపత్రి వంటి కీలక ఆరోగ్య కేంద్రాలు సేవలను నిలిపివేశాయి. ఇజ్రాయెల్ ఇటీవల సహాయ సామగ్రి రవాణాకు అనుమతిస్తామని ప్రకటించినప్పటికీ అది మాటల వరకే సరిపోయింది. దీంతో ఇజ్రాయెల్ తీరుపై అంతర్జాతీయ సమాజంలో వ్యతిరేకత పెరుగుతోంది. అనేక ముస్లిం దేశాలు, సంస్థలు ఈ దాడులను అమానవీయమని అంటున్నాయి. ఐక్యరాజ్య సమిత కూడా ఈ దాడులను నిలిపివేయాలని కోరింది. ఇజ్రాయెల్ హద్దు దాటిందని చివరికి మిత్ర దేశాలు, సొంతదేశంలోని నాయకులు కూడా విమర్శిస్తున్నారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాజీ డిప్యూటీ కమాండర్ యాయిర్ గోలన్.. ఇటీవల ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశం సరైన దారిలో వెళ్లకపోతే, దక్షిణాఫ్రికా లాగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సరైన దేశం పౌరులపై యుద్ధం చేయదని, చిన్న పిల్లల చావులను చూసి సంతోష పడదని ఇజ్రాయెల్ దాడులను ఉద్దేశించి మాట్లాడారు. గాజాలోని పౌరులను టార్గెట్ చేయొద్దని సూచించారు. తాజాగా ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి, ఐడీఎఫ్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోషే కూడా నెతన్యాహును విమర్శించారు. ఇది అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న దాడులుగా కనిపిస్తున్నాయి.. ఇది దేశాన్ని నాశనం వైపు నడిపిస్తోందని ఆరోపించారు. సొంతదేశంలోని నాయకుల వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.

అటు యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్ తీరును విమర్శిస్తున్నాయి. యూకే ఇజ్రాయెల్ పై ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలను యూకే నిలిపివేసింది. తమ దేశంలోని ఇజ్రాయెల్ రాయబారిని పిలిపించి మాట్లాడింది. యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను ఇక సమర్థించలేనివి చెప్పేశారు. ఇజ్రాయెల్‌తో తమ రాజకీయ, ఆర్థిక సంబంధాలను యూరోపియన్ యూనియన్ పున: సమీక్షించుకుంటోంది. ఇజ్రాయెల్ సైనిక చర్యలను ఖండిస్తూ, గాజాలో మానవతా పరిస్థితి మెరుగుపడకపోతే మరిన్ని చర్యలు తీసుకుంటామని యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరించాయి. అయితే ఇజ్రాయెల్ తన దాడులను సమర్థించుకుంటోంది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడం, బందీలను విడుదల చేయడం కోసం ఈ దాడులు అవసరమంటోంది. అయితే ఇజ్రాయెల్ గాజాపై పూర్తి నియంత్రణ సాధించి, పూర్తి పట్టుసాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొందరు అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగా గాజాలోని ప్రజలు బలవంతంగా వలస వెళ్లేలా ఇజ్రాయెల్ చేస్తోందని, అందుకే తీవ్రమైన దాడులు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.

అసలు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఎలా మొదలయ్యాయి..? 19 నెలల క్రితం, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దును దాటి 1,200 మందిని చంపేశారు. వీరిలో ఎక్కువగా ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. 251 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. దీంతో గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. అప్పుడు ఇజ్రాయెల్ దాడులను చాలా మంది సమర్థించారు. కాని ఇప్పుడు పరిస్థితులు వేరు. గాజా పూర్తిగా శ్మశానంలా మారింది. ఎక్కడ చూసిన శిథిలమైన భవనాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అక్కడి ప్రజలు నీరు, ఆహారం, మందులు లేక బతకలేక చావలేక జీవిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దాడులు అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇజ్రాయెల్ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో 61 శాతం మంది యుద్ధాని ఆపాలని ఓటు వేయగా.. 25 శాతం మంది యుద్ధాన్ని కొనసాగించాలని.. గాజాను ఆక్రమించాలని ఓటు వేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌ను పూర్తిగా నాశనం చేసి, మిగిలిన బందీలను విడిపించాలని అంటోంది. 1,200 ఇజ్రాయెల్ ప్రజలను చంపేసినప్పుడు ఎందుకు వీరు మాట్లాడలేదని అంటోంది. నెతన్యాహు కూడా అప్పుడే పూర్తి విజయం సాధిస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో నెతన్యాహుకు ఇంకా బలమైన మద్దతు ఉంది. అయితే బందీల కుటుంబాల్లో ఎక్కువ మంది యుద్ధం ఆగాలని, శాంతి చర్చల ద్వారా బందీలను విడిపించాలని కోరుకుంటున్నారు. కొందరు మాత్రం హమాస్‌ను అంతం చేయడమే ప్రధాన లక్ష్యమని, ఆ తర్వాత బందీలు విడుదలవుతారని అంటున్నారు.