ట్రంప్‎కు ఖమేనీ వార్నింగ్..!

Iran Israel Battle Begins: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి తమపై దాడికి దిగితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి వేరే విధంగా ఉంటుందన్నారు. అటు ఇరాన్ దాడులను అడ్డుకోవడం ఇజ్రాయెల్ కు తలకు మించిన భారంగా మారింది. ప్రతీ రోజు డిఫెన్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎంత వరకు కొనసాగే అవకాశం ఉంది. ఖమేనీ అమెరికాకు లొంగే ప్రసక్తే లేదని చెప్పడంతో ఇప్పుడు ట్రంప్ ఏం చేయనున్నారు..? ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం ఎలా సాగుతోంది..?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజుకు పెరుగుతూనే ఉంది. ఇరాన్ పై వరుస దాడులతో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లోని కీలక స్థావరాలపై దాడులు చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇజ్రాయెల్ తమ మీద దాడి చేసి పెద్ద తప్పు చేసిందని, దానికి తగిన శిక్ష ఖాయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేశారు. ఇరాన్ ఎప్పటికీ ఓడిపోదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల గురించి మాట్లాడుతూ, ఇరాన్ చరిత్ర తెలిసినవాళ్లకి అలాంటి బెదిరింపులకు భయపడమని అర్థమవుతుందన్నారు. అమెరికా సైన్యం ఈ గొడవలో జోక్యం చేసుకుంటే, తిరిగి లేవలేని నష్టం జరుగుతుందని తెలుసుకోవాలన్నారు. ఇరాన్ మీద దాడి చేయడం అంత సులభం కాదని.., అమెరికాకి షాక్ ఇచ్చేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉందని.. ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా జోడీ కట్టిందంటే, ఇది పశ్చిమాసియాలో పెద్ద యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికారి కూడా హెచ్చరించారు. తమపై దాడులకు తగిన సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

అటు ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ దద్దరిల్లుతోంది. ఇరాన్ అణు ముప్పును తాము ఒక పక్కా ప్లాన్‌తో కట్టడి చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెప్తోంది. తమ వైమానిక దళం ఇప్పటికే ఇరాన్‌లో 1,100 కీలక స్థానాలను నాశనం చేసిందని ఐడీఎఫ్ అధికారి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. తాము చేసే దాడులతో ఇరాన్‌కు భారీ నష్టం కలుగుతోందని.. క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయని అన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. గత శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. పశ్చిమ ఇరాన్, టెహ్రాన్ ఆకాశంలో తాము పూర్తి ఆధిపత్యం సాధించామని చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటివరకు 70 ఇరాన్ కు చెందిన ఎయిర్ డిఫిన్స్ వ్యవస్థలను పేల్చేశామని అంటోంది ఇజ్రాయెల్. అయితే, ఒక ఇజ్రాయెల్ డ్రోన్‌ని కూల్చేశామని ఇరాన్ కూడా ప్రకటించింది, దీన్ని ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది. ఆ డ్రోన్‌న సమాచారాన్ని లీక్ చేసే ఛాన్స్ లేదని, ఇరాన్ ఒక ఉపరితలం-గగన క్షిపణితో దాన్ని కూల్చిందని చెప్పింది.

ఇరాన్ సైనిక స్థావరాలను దెబ్బతీసి తాము గెలిచామని ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నా, ఇరాన్ ఎదురుదాడులను అడ్డుకోవడానికి చాలా కష్టపడుతోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థకు తూట్లు పడటంతో, ఇరాన్ క్షిపణులు కీలక ప్రాంతాల మీదకు దూసుకొస్తున్నాయి. వీటిని ఆపడానికి నెతన్యాహు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క రక్షణ వ్యవస్థ నిర్వహణకే ఒక రాత్రికి దాదాపు 285 మిలియన్ డాలర్లు అంటే రూ.2400 కోట్లు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. గత వారం ఇరాన్ అణు స్థావరాలను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడులు చేసింది. దీంతో ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగింది. ఇప్పటివరకు దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులు పంపినట్టు ఇరాన్ చెప్పింది. ఈ క్షిపణులు చాలా ఎత్తులో వెళ్తాయి. వీటిని ఆపడానికి ఇజ్రాయెల్ యారో సిస్టమ్ తో పాటు డేవిడ్స్ స్లింగ్, అమెరికా ఇచ్చిన పాట్రియాట్, థాడ్ బ్యాటరీల వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను వాడుతోంది. అయినా, ఈ వ్యవస్థల నిర్వహణ ఖర్చు ఇజ్రాయెల్‌కు భారంగా మారుతోంది. ఒక్క రాత్రికి 285 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నట్టు ది మార్కర్ అనే ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ పత్రిక అంచనా వేసింది. యారో సిస్టమ్ లోనే ఒక్కో ఇంటర్‌సెప్టర్ 3 మిలియన్ డాలర్లు, దీనితో క్షిపణులను అడ్డుకుంటున్నారు. ఇరాన్ రోజూ క్షిపణులు పంపిస్తూనే ఉంది, ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల నిల్వలు 10-12 రోజుల్లో తగ్గిపోయే ప్రమాదం ఉంది. అమెరికా నుంచి సాయం లేదా సరఫరా ఆగిపోతే, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఇబ్బందుల్లో పడొచ్చు. Iran Israel Battle Begins

అయితే ఇరాన్ ఎంత ఎదిరించినా ఆ దేశ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు తగ్గేదేలేదని ఇజ్రాయెల్ చెబుతోంది. తాజాగా, టెహ్రాన్ అణు కార్యక్రమానికి చాలా ముఖ్యమైన సెంట్రిఫ్యూజ్‌ల తయారీ కేంద్రంపై ఐడీఎఫ్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. టెహ్రాన్ రాజధాని దగ్గర ఉన్న ఈ కేంద్రంపై దాదాపు 50 ఫైటర్ జెట్లు ఒకేసారి దాడి చేశాయని ఐడీఎఫ్ తెలిపింది. అంతేకాకుండా, చాలా ఆయుధ తయారీ కేంద్రాలను కూడా నాశనం చేశామని చెప్పింది. అణుబాంబు తయారీలో ఈ సెంట్రిఫ్యూజ్‌లు చాలా కీలకం. అణుబాంబు కోసం యూ రేనియం 238ని ప్రాసెస్ చేసి, యూరేనియం 235ని తీస్తారు. ఈ ప్రాసెస్‌లో సెంట్రిఫ్యూజ్‌లను వాడతారు. యూరేనియం 238ని రసాయన చర్యలతో యూరేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్‌గా మార్చి, సెంట్రిఫ్యూజ్‌లోకి పంపిస్తారు. ఇవి 50,000 ఆర్‌పీఎం కంటే ఎక్కువ వేగంతో తిరిగి, భారమైన యూరేనియం 238ని బయటకు పంపి, యూరేనియం 235ని మధ్యలో సేకరిస్తాయి. ఇలా చేస్తూ అణుబాంబు కోసం యూరేనియం సేకరిస్తారు. నతాంజ్ అణు కేంద్రం దెబ్బతిన్నట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. మొదట్లో ఈ కేంద్రం అండర్‌గ్రౌండ్ భాగాలకు నష్టం లేదని సంస్థ అధిపతి గ్రోసి చెప్పినా, ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాత అంచనాలు మార్చారు. న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ ప్రకారం, ఈ కేంద్రంలో 50,000కు పైగా సెంట్రిఫ్యూజ్‌లు అమర్చే సామర్థ్యం ఉంది, ప్రస్తుతం 14,000కు పైగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఈ దాడిలో దెబ్బతిన్నాయని అంచనా.

Also Read: https://www.mega9tv.com/international/israel-uses-ai-facial-recognition-and-remote-operated-mission-gun-to-kill-mohsen-fakhrizadeh/