ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ ప్లానేంటి?

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. అటు ట్రంప్ ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఇరాన్‌పై అమెరికా ప్రత్యక్షంగా యుద్ధం చేస్తుందా అనే అనుమానాలు కలుగులున్నాయి. అసలు టెహ్రాన్‌ను ఖాళీ చేయమని ట్రంప్ ఎందుకు హెచ్చరించారు? G7 సమావేశాన్ని మధ్యలో వదిలేసి ట్రంప్ ఎందుకు అమెరికా వెళ్లిపోయారు? ఇజ్రాయెల్ దాడులు చేసినా.. ఇరాన్ అణు కేంద్రాలకు ఏమీ కాలేదని.. IAEA చెప్పిన నేపథ్యంలో.. అమెరికా B2 బాంబర్లను ఎందుకు సిద్ధం చేస్తోంది? మిడిల్ ఈస్ట్‌లో విమానాశ్రయాలు ఎందుకు మూసేశారు? ఇరాన్‌లో ఉన్న భారతీయులను ఎలా తరలిస్తున్నారు?

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజా పరిణామాలు చూస్తే అమెరికా కూడా ప్రత్యక్ష యుద్ధంలో అడుగు పెడుతుందనే మాట వినిపిస్తోంది. ఇజ్రాయిల్ ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది. నాటాంజ్ అణు కేంద్రం, సైనిక స్థావరాలు, ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసింది. టెహ్రాన్‌లోని రాష్ట్ర టీవీ భవనం, సైనిక కేంద్రాలపైనా దాడులు జరిగాయి. ఇరాన్ సైతం ధీటుగా జవాబు ఇచ్చింది. 200 బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్‌లతో ఇజ్రాయిల్‌పై ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్ మిసైళ్లు రాత్రి వేళల్లో ఎక్కువగా దాడి చేస్తున్నాయి. ఎందుకంటే, ఇరాన్‌కు ఇజ్రాయిల్ లాంటి అత్యాధునిక విమానాలు లేవు. దీంతో షహబ్, ఫతేహ్-110, జొల్ఫఘర్ లాంటి ద్రవ, ఘన ఇంధన క్షిపణులను ఉపయోగిస్తోంది. రాత్రి దాడులు చేస్తే శత్రువును గందరగోళంలో పడేస్తాయని, ఇజ్రాయిల్ నిఘా విమానాలు, ఉపగ్రహాలకు కనిపించకుండా ఉంటాయని ఇరాన్ వ్యూహం.

ఇజ్రాయిల్ దాడులు తీవ్రమవడంతో టెహ్రాన్‌లో రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ టెహ్రాన్ డిస్ట్రిక్ట్ 3 ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, పార్కులు ఉన్నాయి. జూన్ 15న ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు, సీనియర్ మిలిటరీ అధికారి అలీ షాద్మానీ మృతి చెందాడు. షాద్మానీ ఇజ్రాయిల్‌పై క్షిపణి దాడులకు నాయకత్వం వహిస్తున్నాడని IDF చెప్పింది. ఇరాన్‌లోని 120 క్షిపణి లాంచర్లను, ఇది మొత్తం లాంచర్లలో మూడో వంతును, IDF ధ్వంసం చేసింది. అయినా ఇరాన్‌కు ఇంకా భారీ సంఖ్యలో క్షిపణులు, లాంచర్లు భూగర్భ సొరంగాల్లో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అటు ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌కు ఏమైందో గుర్తుంచుకోవాలని.. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ ఇరాన్ ను హెచ్చరించారు.

అమెరికా ఇప్పటివరకూ నేరుగా దాడుల్లో పాల్గొనకుండా.. ఇజ్రాయిల్‌కు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తోంది. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో G7 సమావేశాన్ని మధ్యలో వదిలేసి వాషింగ్టన్‌కు వెళ్లిపోయారు. G7 నాయకులు ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే యుద్ధం ఆపాలని సూచించారు, కానీ ట్రంప్ దీనికి అంగీకరించలేదు. శ్వేతసౌధంలోని సిట్యుయేషన్ రూమ్‌లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో సమావేశమైన ట్రంప్, ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయడానికి అవకాశం ఇవ్వనని చెప్పారు. సోషల్ మీడియాలో టెహ్రాన్‌ను ఖాళీ చేయండి అని పోస్ట్ చేశారు. ఈ హెచ్చరిక వెనుక ఇజ్రాయిల్ దాడులు తీవ్రమయ్యే అవకాశం, అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో అడుగుపెట్టే అవకాశం ఉందనడానికి సంకేతంగా భావించవచ్చని అంటున్నారు.

అటు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లోని నాటాంజ్ అణు కేంద్రంలో 15,000 సెంట్రిఫ్యూజ్‌లు దెబ్బతిన్నాయి, కానీ ఫోర్డో అణు కేంద్రం సురక్షితంగా ఉందని IAEA అంచనా వేసింది. ఫోర్డో భూగర్భంలో ఉండటం వల్ల దాన్ని ధ్వంసం చేయడం కష్టం. దీన్ని ఛేదించాలంటే అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబ్ వాడాలి. దీన్ని B2 బాంబర్లు మాత్రమే మోస్తాయి. ఇజ్రాయిల్‌కు ఈ బాంబర్లు లేవు. అమెరికా ఇప్పటివరకూ నేరుగా దాడులకు దిగలేదు. కానీ 30 విమానాలను యూరప్‌కు పంపింది. ఇది సైనిక సన్నాహాల సూచనగా నిపుణులు చెప్తున్నారు. అమెరికా B2 బాంబర్లను వాడితే, ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్లే అవుతుంది.

యుద్ధం తీవ్రమవడంతో మిడిల్ ఈస్ట్‌లో విమానాశ్రయాలు మూసేశారు. ఇజ్రాయిల్ ఆకాశ మార్గాన్ని పూర్తిగా బంద్ చేసింది. టెహ్రాన్‌లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా తన పౌరులను జోర్డాన్ సరిహద్దు ద్వారా తరలిస్తోంది. అమెరికా ఇరాక్‌లోని రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని, మిడిల్ ఈస్ట్‌లోని సైనిక కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ యుద్ధం మరింత విస్తరిస్తే, మిడిల్ ఈస్ట్ రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అటు ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నారు, వీరిలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఉన్నారు. భారత విదేశాంగ శాఖ టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయం ద్వారా పరిస్థితిని గమనిస్తోంది. విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే టెహ్రాన్‌లో రోడ్లు బ్లాక్ అవడం, విమానాశ్రయాలు మూసివేయడం వల్ల తరలింపు సవాలుగా మారింది. భారత్ ఒమన్, దుబాయ్‌లోని రాయబార కార్యాలయాలతో సమన్వయం చేస్తోంది. యుద్ధం తీవ్రమైతే, సముద్ర మార్గం ద్వారా తరలింపు జరిగే అవకాశం ఉంది.

ఇజ్రాయిల్ ఇరాన్‌ను యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఇరాన్ సైతం ఇజ్రాయిల్ దాడులను అన్యాయమని పిలుస్తోంది. అమెరికా డిప్లొమసీ కంటే సైనిక చర్యల వైపు మొగ్గు చూపుతోందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ టెహ్రాన్‌ను ఖాళీ చేయమని హెచ్చరించడం, B2 బాంబర్లను యూరప్‌కు పంపడం వెనుక ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధ సూచనలుగా కనిపిస్తున్నాయి.