ఇజ్రాయెల్ వరుస యుద్ధాలు…!

Israel’s Relentless attacks on enemies: మొన్న గాజాపై, నిన్న ఇరాన్‌పై, ఇప్పుడు యెమన్‌లో హూతీలపై ఇజ్రాయెల్ వరుస దాడులతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు రగులుతున్నాయి. 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి, ఇజ్రాయెల్ హమాస్, హెజ్బుల్లా, హూతీల వంటి ఇరాన్ మద్దతు గల శత్రువులపై దాడులను తీవ్రతరం చేసింది. అసలు ఇజ్రాయెల్ కు అలుపు లేదా..? ఇన్ని దేశాలను ఎలా ఎదుర్కొంటోంది..? ఇలా వరుసుగా యుద్ధాలు ఎలా చేస్తోంది. ఈ భారీ దాడుల కోసం ఇజ్రాయెల్ ఆయుధ శక్తి, ఆర్థిక బలం ఎక్కడిది?

ఇజ్రాయెల్ .. నిత్యం యుద్ధాలతో గడుపుతోంది. ఒక దేశం తర్వాత మరో దేశంతో తలపడుతోంది. ఇంత శక్తి, ఓపిక ఇజ్రాయెల్ కు ఎలా వచ్చింది…? అసలు ఇజ్రాయెల్ దాడులకు కారణం ఏం చెబుతోంది..? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఊహించని దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది మరణించారు. 250 మందిని హమాస్ బందీలుగా తీసుకుంది. ఈ సంఘటన ఇజ్రాయెల్‌ను తీవ్రంగా కలవరపెట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ తన రక్షణ కోసం దాడులకు దిగింది. తమ దేశ రక్షణ విషయంలో చిన్న అనుమానం వచ్చిన .. శత్రువులపై దాడి మొదలు పెట్టేస్తోంది. ఈ విధంగానే ఇజ్రాయెల్ గాజాపై భారీ సైనిక దాడులు మొదలుపెట్టింది. గాజాకు ఊపిరిసెలపకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. పాలస్తీనాకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 40,000 మంది పైగా మరణించారు. ఈ గాజా యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను గణనీయంగా పెంచింది. లెబనాన్‌లోని హెజ్బుల్లా, యెమన్‌లోని హూతీలు, ఇరాక్‌లోని షియా మిలిటియాలు ఈ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని ఇజ్రాయెల్ పై దాడులు చేశాయి. ఈ గ్రూపులు పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ.. ఇజ్రాయెల్‌ పై దాడులను తీవ్రతరం చేశాయి. హెజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది. దీనికి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో స్పందించి, హెజ్బుల్లా నాయకులను లక్ష్యంగా చేసుకుంది. శత్రువుల రక్షణ పొందాలంటే ఎదురు దాడులు ఒక్కటే మార్గమని భావించింది ఇజ్రాయెల్. అంతే తన దాడులను మొదలు పెట్టింది.

2024 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దీనికి సమాధానంగా ఇరాన్‌లోని నాటాంజ్ అణు కేంద్రం, సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం, దాని మిలిటియా సమూహాలకు అందిస్తున్న మద్దతు ఇజ్రాయెల్‌కు పెద్ద ముప్పుగా మారింది. మరోవైపు యెమన్‌లో హూతీలు 2023 అక్టోబర్ 19 నుంచి ఇజ్రాయెల్‌పై మిసైల్స్, డ్రోన్‌లతో దాడులు చేస్తున్నారు. వీరు గాజా యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ, రెడ్ సీలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న వాణిజ్య ఓడలను కూడా టార్గెట్ చేశారు, దీనివల్ల గ్లోబల్ ట్రేడ్‌కు ఆటంకం ఏర్పడింది. ఇజ్రాయెల్ ఈ దాడులను తన భద్రతకు పెద్ద ముప్పుగా భావించింది. హూతీల సైనిక, ఆర్థిక సామర్థ్యాలను దెబ్బతీసేందుకు యెమన్‌లో దాడులు చేస్తోంది. ఈ వరుస దాడుల వెనుక ఇజ్రాయెల్ లక్ష్యం క్లియర్ గా కనిపిస్తోంది. ఇరాన్ మద్దతు గల సమూహాలను బలహీనపరచడం, తన సరిహద్దులను రక్షించుకోవడం ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం. Israel’s Relentless attacks on enemies.

హూతీలపై ఇజ్రాయెల్ దాడులు 2023 అక్టోబర్ నుంచి తీవ్రమయ్యాయి. హూతీలు ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్‌లతో దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ప్రతిదాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం, యెమన్‌లో హూతీలు నియంత్రించే ప్రాంతాల్లోని లక్ష్యాలపై ఖచ్చితమైన, శక్తివంతమైన వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు జెరూసలెం నుంచి 1000 మైళ్ల దూరంలో ఉన్న యెమన్‌లో జరిగాయి. 2024 జులై 20న హూతీలు టెల్ అవీవ్‌పై తొలిసారి డ్రోన్ దాడి చేశారు, దీనికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్ యెమన్‌లోని హోడైడా ఓడరేవుపై భారీ వైమానిక దాడి నిర్వహించింది. హూతీల ఆయిల్ స్టోరేజ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్ యెమన్‌లోని మూడు ఓడరేవులు, ఒక పవర్ ప్లాంట్‌పై దాడులు చేసింది. ఇజ్రాయెల్ తన ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు, అరో, డేవిడ్ స్లింగ్, హూతీ మిసైల్స్‌ను అడ్డుకున్నప్పటికీ, కొన్ని మిసైల్స్ ఇజ్రాయెల్ గగనతలంలోకి చొచ్చుకొచ్చాయి.

ఇజ్రాయెల్ బలమైన ఆర్థిక వ్యవస్థ, అధునాతన సైనిక శక్తి, అంతర్జాతీయ మద్దతు ఈ వరుస దాడులకు సహాయ పడుతున్నాయి. 2024లో ఇజ్రాయెల్ GDP 530 బిలియన్ డాలర్లుగా ఉంది, ఇది మధ్యప్రాచ్యంలో అత్యంత ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. హై-టెక్ ఇండస్ట్రీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ టెక్నాలజీ, డైమండ్ ఎగుమతులు, టూరిజం వంటివి ఇజ్రాయెల్ ఆర్థిక వనరులుగా ఉన్నాయి. 2025లో ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ 24 బిలియన్ డాలర్లుగా ఉంది, ఇది దాని GDPలో 5-6% ఉంటుంది. ఈ బడ్జెట్ ఇజ్రాయెల్‌కు అధునాతన ఆయుధాల అభివృద్ధికి సహాయపడుతుంది. అమెరికా ఇజ్రాయెల్‌కు సంవత్సరానికి 3.8 బిలియన్ డాలర్ల సైనిక సహాయం అందిస్తోంది. ఈ సహాయం రూపంలో F-35 ఫైటర్ జెట్‌లు, ఆయుధాలు, అరో, డేవిడ్ స్లింగ్ వంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అందుతున్నాయి. 2023 అక్టోబర్ నుంచి గాజా యుద్ధం కోసం అమెరికా అదనంగా 14 బిలియన్ డాలర్ల సహాయం ఆమోదించింది. ఇజ్రాయెల్ స్వదేశీ రక్షణ కంపెనీలు, రాఫెల్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వంటివి డ్రోన్‌లు, మిసైల్స్, రాడార్ సిస్టమ్స్‌ను తయారు చేస్తాయి. ఈ స్వదేశీ ఉత్పత్తులు దాడుల ఖర్చును తగ్గిస్తున్నాయి. అలాగే ఆయుధ ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు హూతీలను వ్యతిరేకిస్తాయి. ఇజ్రాయెల్ దాడులకు పరోక్షంగా మద్దతు ఇస్తాయి. 2024 ఏప్రిల్‌లో ఇరాన్ దాడిని అడ్డుకోవడంలో ఈ దేశాలు ఇజ్రాయెల్‌కు సహకరించాయి.

Also Read: https://www.mega9tv.com/international/elon-musk-launches-new-party-called-the-america-party-against-donald-trump/