ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం..? ట్రంప్ ఎందుకు భయపడుతున్నారు..? ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందా..?

పశ్చిమాసియాలో మరో యుద్ధం రానుందా..? ఇరాన్ తీరు ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోందా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి రెడీ అవుతోందనే వార్తల్లో నిజమెంత..? అటు అమెరికాకు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..? ఎందుకు ట్రంప్ మిడిల్ ఈస్ట్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నారు.? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి..? ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ విషయంలో ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తోందా..?

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొంటున్నాయి. ఓ పక్క ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతోంటే.. మరోవైపు ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి చేయోచ్చని భావిస్తున్నారు. దీంతో ట్రంప్ పశ్చిమాసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు. అలాగే అణుచర్చల కోసం ట్రంప్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ ఇరాన్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇరాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకోవడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలకు ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకూ ఫోన్ చేశారు. గాజాలో యుద్ధాన్ని ఆపాలని కోరినట్లు తెలసింది. ఈసందర్భంగా ఇరాన్‌పై దాడి గురించి బహిరంగంగా మాట్లాడటం ఆపాలని, దాడుల ప్లాన్‌ పక్కన పెట్టాలని ట్రంప్‌ కోరారు. అయితే ఇరాన్‌కు ఒప్పందం చేసుకొనే ఉద్దేశమే లేదని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరువురు ట్రంప్, నెతన్యాహు మధ్య ఇటీవల దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం ఇవ్వలేదు. అణు చర్చలు విఫలమైతే ఇజ్రాయెల్‌ ఇరాన్ పై దాడి చేయోచ్చని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇరాన్‌ ప్రభుత్వ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ తాము సిద్ధంగా ఉన్నామని అంటూ పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఇరాక్‌లో ఉన్న దౌత్య సిబ్బంది, సైనిక కుటుంబాలు వెనక్కి రావాలని ప్రకటించారు. యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నౌకలకు హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్‌ గల్ఫ్‌, హర్మూజ్‌ జలసంధి, ఒమన్‌ తీరంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి ఈ మార్గం అత్యంత కీలకం.

మరోవైపు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ ప్రమాదకరమైన ప్రాంతం అని పేర్కొన్న ఆయన.. తమ సైనిక కుటుంబాలు, దౌత్య సిబ్బందిని అక్కడినుంచి తరలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇరాన్‌ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదన్నారు. అణు చర్చలు విఫలం అయితే, ఇరాన్‌ పై దాడులు చేస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఓ ఇంటర్వ్యూలో కూడా.. యురేనియం శుద్ధి చేయడాన్ని టెహ్రాన్‌ ఆపేస్తుందనే నమ్మకం తనకు లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ రక్షణ మంత్రి అజీజ్‌ నసీర్జాదే హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు కువైట్‌ లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో తమ సిబ్బందిని ఎక్కడికీ తరలించడం లేదని పేర్కొంది. అయితే, కువైట్‌ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అత్యవసరం కాని అమెరికా సిబ్బంది ఆ ప్రాంతాన్ని వీడాలని కోరింది.

ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజంలో వివాదాస్పదంగా ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత శక్తి ఉత్పత్తి కోసమేనని చెప్పినప్పటికీ, అణ్వాయుధాల తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోందనే అనుమానాలున్నాయి. 2015లో JCPOAఒప్పందం కుదిరినప్పటికీ, 2018లో అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. అటు ఇరాన్ తన యురేనియం నిల్వలను పెంచుకోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 2023 IAEA నివేదిక ప్రకారం, ఇరాన్ యురేనియం నిల్వలు JCPOA పరిమితులను 22 రెట్లు అధిగమించాయి. ఇది అణ్వాయుధ తయారీకి సరిపోతుందని అంచనా. ఇరాన్ NPT బాధ్యతలను ఉల్లంఘించిందని, IAEA తనిఖీలను అడ్డుకుంటుందని అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నిబంధనలను ఇరాన్‌ ఉల్లంఘిస్తోందని IAEA గుర్తించింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐఏఈఏ బోర్డు గవర్నర్లు ఆమోదం తెలిపారు. తాజా పరిణామం ఇరాన్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను పొడిగించే అవకాశం ఉంది. వియన్నాలో జరిగిన సమావేశంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఓటింగ్‌ జరిపారు. ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోందని, వాటిని అణుకేంద్రాలుగా ఎందుకు ప్రకటించలేదో తక్షణమే సమాధానం చెప్పాలని ఐఏఈఏ బోర్డు ఇరాన్‌ను కోరింది. అక్కడ లభ్యమైన ఆధారాల ద్వారా 2003 వరకు ఇరాన్‌ రహస్య అణ్వాయుధాలను అభివృద్ధి చేసిందని నిరూపించవచ్చని పాశ్చాత్యదేశాలు చెబుతున్నాయి. ఇరాన్‌పై ఫ్రాన్స్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బ్రిటన్‌, జర్మనీ, అమెరికా దేశాలు వాటిని ఆమోదించాయి.

అయితే ఇరాన్ అణు సాంకేతికత 1950ల నుంచే రావడం మొదలైంది. అమెరికా అటమ్స్ ఫర్ పీస్ కార్యక్రమం నుంచి ఇది ప్రారంభమైంది. ఇందులో ఇరాన్‌కు తొలి పరిశోధన రియాక్టర్ అందించబడింది. 1979 ఇరానియన్ విప్లవం తర్వాత, ఈ సహకారం ఆగిపోయినప్పటికీ, ఇరాన్ రహస్యంగా అణు కార్యక్రమాన్ని కొనసాగించింది. 1980లో పాకిస్థాన్ నుంచి ఇరాన్ కొంత టెక్నాలజీని సంపాదించింది. 1990లలో రష్యా, చైనా నుంచి బుషెహర్ రియాక్టర్ నిర్మాణంలో సహాయం, ఉత్తర కొరియాతో మిస్సైల్ టెక్నాలజీ ఒప్పందాలు ఇరాన్ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచాయి. ఇరాన్ స్వదేశీ సెంట్రిఫ్యూజ్ తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, ఉన్నత నాణ్యత కార్బన్ ఫైబర్, మారాజింగ్ స్టీల్ వంటి కొన్ని మెటీరియల్స్‌కు మాత్రం విదేశాలపై ఆధారపడుతోంది. వీటి వల్ల ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలు ఎదురవుతున్నాయి.