జపాన్ కు భారీ ప్రళయం రాబోతోందా..?

Japan about to experience a major disaster Seismic activity has intensified since June 21 Warning of a major earthquake
Japan about to experience a major disaster Seismic activity has intensified since June 21 Warning of a major earthquake… Picture Credits ( iStock )

Japan Earthquake Warning: జపాన్ అంటే భూకంపం.. భూకంపం అంటేనే జపాన్ గుర్తుకు వస్తుంది. ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు వచ్చే దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే ఆ దేశ ప్రజలు భూకంపానికి ప్రతీ రోజు సిద్ధంగా ఉంటారు. అయితే జపాన్‌లోని టోకారా దీవుల్లో రెండు వారాల్లో 900 కంటే ఎక్కువ భూకంపాలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గంటకు సగటున మూడు కంటే ఎక్కువ భూకంపాలు నమోదవడంతో, ఈ చిన్న దీవుల్లో నివసించే ప్రజలు భయంతో వణికి పోతున్నారు.. అసలు ఇన్ని ఎక్కువ సార్లు భూకంపాలు రావడం వెనక కారణాలు ఏమిటి? ఇది రాబోయే మహా విపత్తుకు హెచ్చరిక? ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ జపాన్ లో రాబోయే ప్రళయం గురించి ఏం చెప్పారు..?

జపాన్ .. ఒక భూకంపాల దేశం. ఎన్నో భయంకరమైన భూకంపాలను జపాన్ చూసింది. వీటికి తోడు సునామీలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. అయినా తట్టుకుని నిలబడుతోంది ఆ దేశం. అయితే కొద్ది రోజులుగా జపాన్ కు ఏదో భారీ విపత్తు ఎదురుకాబోతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ దేశ వాసులకు కంటి మీద కనుకులేకుండా పోతోంది. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. జపాన్ లో ఎప్పుడూ భారీ భూకంపం వచ్చినా .. దానికి కొద్ది రోజుల ముందు సూచనలు కనిపిస్తాయి. అక్కడక్కడ చిన్నచిన్న ప్రకంపనలు సంభవిస్తాయి. ఇప్పుడే అదే పరిస్థితి నెలకొంది. జపాన్‌లోని టోకారా దీవులు గత రెండు వారాలుగా భూకంపాలతో వణికిపోతున్నాయి. జూన్ 21 నుంచి జూలై 3 వరకు, 900 కంటే ఎక్కువ భూకంపాలు నమోదయ్యాయి. ఇందులో బుధవారం 5.5 తీవ్రతతో ఒక పెద్ద భూకంపం కూడా ఉంది. ఈ దీవుల్లోనే కొన్ని చోట్ల 6 -7 మధ్య తీవ్రత కూడా నమోదైంది. ఇది స్థానికంగా నష్టాన్ని కలిగించింది. భూకంపాల వల్ల తాము నిద్రపోలేకపోతున్నామని.., ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్ వాతావరణ శాఖ ఈ సీస్మిక్ యాక్టివిటీ కొద్దిరోజుల నుంచి చాలా తీవ్రంగా ఉందని, మరింత బలమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

జపాన్ ప్రపంచంలో అత్యంత భూకంపాలకు గురయ్యే దేశాల్లో ఒకటి, సంవత్సరానికి సుమారు 1,500 భూకంపాలు నమోదవుతాయి. దీనికి ప్రధాన కారణం జపాన్ భౌగోళిక స్థానం. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉంది, ఇక్కడ అనేక టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. ఈ ప్లేట్లు ఒకదానిపై ఒకటి జారడం లేదా ఒత్తిడి పెరగడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి. టోకారా దీవుల సమీపంలోని సముద్ర గర్భంలోని అసాధారణ భౌగోళిక నిర్మాణం ఒత్తిడికి కారణమై, ఎక్కువగా భూకంపాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో, 2023 సెప్టెంబర్‌లో టోకారా దీవుల్లో 346 భూకంపాలు నమోదయ్యాయి, కానీ ఈసారి 900 భూకంపాలు రెండు వారాల్లోనే సంభవించడం అసాధారణం. ఈ భూకంపాలు ఎక్కువగా చిన్న తీవ్రత కలిగినవైనప్పటికీ, పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందనే భయం కలవరపెడుతోంది. జపాన్‌లో గతంలో 2011లో 9.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇది సునామీకి కారణమైంది. ఈ భూకంపం వల్ల 18 వేల మంది ప్రాణాలు పోయాయి.

జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉండటంతో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం. ఇది భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కువగా జరిగే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తీరాల వరకు విస్తరించి ఉంది. ఈ రింగ్‌లో భూమి ఉపరితలం కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్లు నిరంతరం కదలడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడానికి కారణమవుతుంది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రపంచంలో 75% అగ్నిపర్వతాలు పేలుళ్లకు, 90% భూకంపాలకు కారణమవుతోంది. జపాన్ ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో కీలక స్థానంలో ఉంది. ఎందుకంటే ఇది నాలుగు ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల కలయిక ప్రాంతంలో ఉంది. ఈ కారణంగా, జపాన్‌లో సంవత్సరానికి వేల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి. టోకారా దీవుల వంటి ప్రాంతాలు ఈ సీస్మిక్ యాక్టివిటీకి అత్యంత దగ్గరగా ఉన్నాయి. అందుకే ఏం జరిగినా ముందుకు ఇక్కడే మొదలవుతుంది. అయితే ప్రస్తుతం జపాన్ లో పరిణామాలు కొద్ది రోజుల్లో వచ్చే మహా విపత్తుకు సూచనలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. Japan Earthquake Warning.

అటు బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ జ్యోతీష్యం జపాన్ వాసులను భయపెడుతోంది. ఆమె ఊహించిన ఎన్నో భయంకర ఉత్పాతాలు నిజంగానే జరిగాయి. జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తును సరిగ్గానే ఊహించగలదని చాలా మంది నమ్ముతారు. ఆమె 2025 జులై నెల గురించి చెప్పిన ఓ వార్తతో జపాన్ పర్యాటక రంగం కుదేలైంది. ఆ అంచనా నిజం కాదని జపాన్ అధికారులు చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం టాట్సుకీ మాటలనే నమ్ముతున్నా రు. రియో టాట్సుకి రచించిన ది ఫ్యూచర్ ఐ సా అనే పుస్తకమే జపాన్ పర్యాటకానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2025, జులై 5వ తేదీన జపాన్‌లో ఓ భారీ సునామీ వస్తుందని, దాంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె పేర్కొన్నారు. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చని ఆమె ఊహించారు. ఈ ప్రళయం 2011లో విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా భారీగా ఉంటుందని, జపాన్‌ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. 2011 నాటి భారీ భూకంపం, సునామీని కూడా టాట్సుకీ ముందుగానే ఊహించి హెచ్చరించారు. జపాన్, ఫిలిప్పీన్స్‌ మధ్య సముద్రం మరుగుతున్నట్టు, భారీ బుడగలు ఏర్పడుతున్నట్టు ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు. టాట్సుకీ అంచనాలు పర్యాటకులు, జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టాట్సుకి అంచనాల కారణంగా జపాన్‌కు వచ్చే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. జూన్‌ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోయాయట.

అయితే జపాన్ ప్రభుత్వం రాబోయే విపత్తులకు ముందే సిద్ధంగా ఉంటుంది. గతం నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని జపాన్ ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా ఇప్పుడే కాకుండా .. ఎప్పుడూ జపాన్ భూకంపాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. జపాన్ లోని భవనాలు భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తారు. అలాగే అక్కడి ప్రజలను భూకంపాల సమయంలో హెచ్చరించడానికి ప్రత్యేక సైరెన్లు ఏర్పాటు చేశారు. భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు ఇవి మోగుతాయి. అలాగే పాఠశాల స్థాయి నుంచి భూకంపాలపై పిల్లలకు అవగాహన కల్పిస్తారు. భూకంపం వస్తే ఎలా స్పందించాలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో సిలబస్ ద్వారా నేర్పిస్తారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రకృతి కన్నెర చేస్తే దానిని ఎవరూ ఆపలేరు.. ప్రస్తుతం సూచనలు జపాన్ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ జులై నెల ఎలా దాటుతుందా అని ఎదురుచూస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/international/chinese-president-xi-jinping-missing-xinping-not-seen-in-public-for-several-days/